ప్రతిపాదనల తయారీలో అధికారులు
జూరాలకు పాలమూరు రంగారెడ్డి నీళ్లు
ప్రజాపక్షం / హైదరాబాద్ : కృష్ణా జలాలపై ఆధారపడిన ప్రాజెక్టుల ద్వారా కూడా రెండు పంటలకు సాగు నీరిందించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల కింద సాగునీటి లభ్యత పెంచే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే కృష్ణా జలాలపై ఆధా రపడిన ప్రాజెక్టుల్లో నీటి లభ్యతను పెంచే క్రమం లో అధికారులు నిమగ్నమయ్యారు. నీటి పారు దల శాఖాధికారులు ఇందులో మొదటగా జూరా ల ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. జూరాల ప్రాజెక్టు కింద రెండు సీజన్లలో సాగునీరందించేందుకు ప్రతిపాదనల తయారీని అధికారులు మొదలు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి జూరాలకు నీరు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి వచ్చే నీటితో కోయిల్‌సాగర్, సంగంబండ రిజర్వాయర్‌లను నింపుతూనే జూరాల వరకు నీటిని తరలించే ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. జూరాలకు పాలమూరు నీటిని తరలిస్తే ఏడాదంతా నీటి లభ్యత ఉంటుందన్న నిర్దారణకు నీటిపారుదల శాఖాధికారులు వచ్చారు. జూరాల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.66 టిఎంసిలు కాగా, నికర నీటి నిల్వ సామర్థ్యం 6.80 టిఎంసిలు. ఈ ప్రాజెక్టు కింద 1.02లక్షల ఎకరాల ఆయకట్టు సామర్థ్యం ఉంది. ఈ ప్రాజె క్టుపై ఆధారపడి నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకా లు ఉన్నాయి. వీటన్నింటి కింద మొత్తం 5.50లక్షల ఎకరాల ఆయ కట్టుకు నీరందించాలి. అయితే జూరాల ద్వార వరదల్లోనే నీటిని ఎత్తి పోసే అవకాశం ఉంది. పైగా ఎగువ నుంచి వచ్చే వరద నీటిపైనే ఆధా రపడాల్సిన పరిస్థితి. దీంతో జూరాల ద్వారా కష్టం మీద ఒక పంటకు నీరందింతుండగా, రెండో సీజన్‌లో తాగునీటి అవసరాలను కూడా తీర్చే పరిస్థితి లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కర్వె న రిజర్వాయర్‌కు తరలించే నీటిని జూరాలకు తరలించాలని ముఖ్య మంత్రి నీటి అధికారులకు సూచించినట్లు సమాచారం.