32 పార్టీలతో ఎన్‌డిఎది కూటమి కాదా?
నరేంద్ర మోడీకి సురవరం సుధాకర్‌రెడ్డి సూటి ప్రశ్న
కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే
జెన్‌యు విద్యార్థులపై అక్రమ చార్జిషీటు ఉపసంహరణకు డిమాండ్
ప్రజాపక్షం / హైదరాబాద్ : ప్రతిపక్షాలు కూటమి కట్టడాన్ని ప్రధాని తప్పుబడుతున్నారని, ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం కూటములు కడితే తప్పేమిటని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్షాలు కూటమి కట్టడాన్ని తప్పుబడుతున్న బిజె పి, 32 పార్టీలతో కూటమిగా ఏర్పడితే తప్పులేనప్పుడు ప్రతిపక్షాలు పది, పన్నెం డు పార్టీలతో కూటమిగా ఏర్పడితే తప్పు ఎలా అవుతుందన్నారు. మఖ్దూంభవన్‌లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పి, బిఎస్‌పి కలిస్తే మోడీ కాళ్ళకింద భూమి కదలిపోతోందన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశంలో బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ కేరళలో కమ్యూనిస్టులపై చేసిన ఆరోపణలను సురవరం తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా మతోన్మాదులు చేస్తున్న ఆందోళనలను ప్రధాని ప్రత్యక్షంగా బలపర్చడం సిగ్గు చేటని, ఇది అతని స్థాయికి తగదని చెప్పారు. కన్హయ్యకుమార్, ఇతరులపై తప్పుడు కేసులు బనాయించి 1200 పేజీల ఎఫ్‌ఐఆర్‌ను ఇప్పుడు ఫైల్ చేశారని, జెఎన్‌యు విద్యార్థులపై అక్రమంగా నమోదు చేసిన చార్జిషీట్‌ను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కన్హయ్య ఆరోజు మనువాదం నుండి, సంఘ్ పరివార్ నుండి ఆజాది కావాలని నినాదాలు చేశారని ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి తప్పుడు ఆరోపణలు చేసి వీడియోలను మార్ఫింగ్ చేశారని విమర్శించారు. విద్యార్థులపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఆయన పేర్కొన్నారు. కార్పోరేటీకరణకు అనుకూలంగా మతోన్మాదాన్ని రెచ్చగొడ్తున్న బిజెపి ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా ప్రజలు తిరుగబడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అలోక్ వర్మను బదిలీ చేయడం చాలా దారుణమని, మోడీ ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు చర్య అని సుధాకర్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో ప్రధాని మోడీ కక్ష్యపూరితంగా వ్యవహరించారని, ఇప్పటికీ అతనిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రుజువు కాలేదన్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, సిబిఐ విచారణ మొత్తం వ్యవహారం ప్రజలకు తెలియాల్సి ఉందని చెప్పారు. పరికరాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న 4 లక్షల మంది కార్మికులు జనవరి 23 నుండి 25 వరకు తలపెట్టిన కార్మిక సమ్మెకు సురవరం సంపూర్ణ మద్దతును ప్రకటించారు.