దశాబ్దాలుగా కార్యకలాపాలు
లక్షల్లో బాధితులు
చోద్యం చూస్తున్న పోలీసులు
ప్రజాపక్షం/ హైదరాబాద్ : రాష్ట్రంలో అక్రమ ట్రావెల్ ఏజెన్సీలు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. దశాబ్దాలుగా వీరు తమ కార్యకలాపాలను నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు. విదేశాలలో ఉద్యోగాలంటూ పత్రికలలో అందమైన ప్రకటనలు కూడా ఇస్తున్నారు. ఈ ప్రకటనలు నమ్మిన యువకులు లక్షలాది రూపాయలు ట్రావెల్ ఏజెన్సీ యజమానులకు చెల్లించి చివరకు నిలువునా మోసపోతున్నారు. ఇలా రాష్ట్రంలో లక్షలాది మంది మోసపోతుండగా, మరోపక్క ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం కోట్లాది రూపాయలు వసూలు చేసుకుని దోచుకుంటున్నారు. ఇదంతా బహిరంగంగానే కొనసాగుతున్నా పోలీసులు మాత్రం చూసి చూడనట్లు ఉండడం గమనార్హం. విదేశాలకు వెళ్లి మోసపోయి వచ్చిన బాధితుల్లో కొద్దిమంది మాత్రమే ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులను నిలదీసిన బాధితులపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు పోలీసులు. ట్రావెల్ ఏజెన్సీల పాపం లో పోలీసుల పాత్రపై కూడా అనుమానాలు కలుగుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న అడ్డాలను గుర్తించి దాడులు చేసి కేసులు నమోదు చేసే పోలీసులు బహిరంగంగా అనుమతి లేకుండా నడుస్తున్న ట్రావెల్ ఏజెన్సీలపై ఎందుకు దాడులు చేయడంలేదని,కేసులుఎందుకు నమోదు చేయడంలేదనిబాధితులుప్రశ్నిస్తున్నారు.
ట్రావెల్ ఏజెన్సీల మోసం ఇలా : దుబాయ్, అమెరికా, ఇంగ్లాడ్ తదితర దేశాలలో ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు ఉన్నాయని పత్రికలలో ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వాహకులు ప్రకటన ఇస్తారు. ఈ ప్రకటన నమ్మిన పలువురు నిరుద్యోగులు సదరు ట్రావెల్స్ కార్యాలయాల వద్దకు వచ్చి తమ బయోడేటాను అందిస్తారు. వారి విద్యార్హత, టెక్నికల్ అర్హత మేరకు పలానా ఉద్యోగం వస్తుందని, నెలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జీతం ఉంటుందని నమ్మిస్తారు. ఇందుకోసం ఇంటర్వూలు నిర్వహించాల్సి ఉంటుదని, ఇందులో అర్హత సాధించిన యువకులు వీసా, పాస్‌పోర్టు తదితర ఖర్చుల కోసం తమ ట్రావెల్స్ కంపెనీకి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని నమ్మిస్తారు. వీరికి ఇంటర్వూలు కూడా తీసుకుంటారు. ఆ తరువాత మీరు ఇంటర్వూలో పాస్ అయ్యారు. కావున వెంటనే తాము చెప్పిన డబ్బును చెల్లించాలంటారు. ఇది నమ్మిన బాధితులు అప్పులు చేసి లక్షలాది రూపాయలను ట్రావెల్స్ నిర్వాహకులకు చెల్లిస్తారు. ఆ తరువాత వీరందరిని ముంబయి, బెంగళూరుకు తీసుకెళ్లి అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తారు. అక్కడికి వెళ్లిన తరువాత బాధితులు అసలు మోసం తెలుసుకుంటారు. తమకు చెప్పిన ఉద్యోగాలలో నియమించకుండా కూలీ పనులకు తరలించారని మోసపోయిన బాధితులు ఎలాగో అలా అష్టకష్టాలు పడి తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారు. మరికొందరు స్వదేశానికి పోతే అప్పుల వారు వేధిస్తారనే ఉద్దేశంతో అక్కడే కూలి పనుల్లో స్థిరపడి పోతున్నారు.