HomeNewsBreaking Newsకీసరలో జోరుగా అక్రమ లే అవుట్లు

కీసరలో జోరుగా అక్రమ లే అవుట్లు

గతంలో ప్లాట్లు కొన్నవారి నెత్తిన శఠగోపం
చోద్యం చూస్తున్న గ్రామ పాలకులు, రెవెన్యూ అధికారులు
ప్రజాపక్షం / మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి
‘వడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా అంతా సవ్యంగానే దొరుకుతుంది’ అనే సామెత చందంగా కీసర మండల పాలకులు, అధికారుల తీరు తయారైంది. గ్రామ పాలకులు, అధికారుల అండ చూసుకుని గతంలో చేసిన రియల్‌ ఎస్టేట్‌ లే అవుట్లను కొంతమంది దళారులు తిరిగి మళ్లీ లే అవుట్లు చేస్తున్న పరిస్థితి మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలం దాయరలో నెలకొంది. గతంలో ప్లాట్లు కొనుగోలు చేసుకున్న వారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. పైసా పైసా కూడబెట్టి ఇంత భూమి కొనుక్కున్నామనే ఆనందం లేకుండా దళారులు, కబ్జాకోరులు దారుణాలకు పాల్పడుతున్నారు. ఇందుకు సంబంధించి బాధితుల నుంచి సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. కీసర గ్రామ పంచాయతీ పరిధిలోని కీసర దాయర రెవెన్యూ సర్వే నెంబర్‌ 184, 185, 186, 196లో భూమిని 1984లో గ్రామ పంచాయతీ అనుమతితో ‘గాంధీనగర్‌ కాలనీ’ పేరుతో లే అవుట్‌ చేశారు. పలు ప్రాంతాలకు చెందిన వారు ఈ లే అవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేశారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకున్న కబ్జాదారులు తిరిగి ఆ భూమిపై పట్టాదారు పాసుపుస్తకాలు పొంది, లే అవుట్‌ చేసిన భూమిని తిరిగి కొంత మందికి విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తులు ఈ భూమిని చదును చేసి కొత్త హంగులు, ఆర్భాటాలతో తిరిగి లే అవుట్లు చేస్తున్నారు. గతంలో ప్లాట్లు కొన్న కొనుగోలుదారులు రీ లే అవుట్‌పై గ్రామ పంచాయతీ కార్యాలయంలో, తహసీల్దార్‌ కార్యాలయంలో, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో, హెచ్‌ఎండిఏ కార్యాలయంలో, కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గతంలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి అండగా ఉండాల్సిన పాలకులు, అధికారులు పట్టించుకోకుండా రీ లేఅవుట్‌ చేస్తున్న వారి నుంచి ముడుపులు తీసుకుని వారికి మద్దతు పలుకుతున్నారని అనేక ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎంతో శ్రమతో ప్రతి పైసా కూడబెట్టుకుని కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు కట్టుకుందామని వెళితే ప్లాటు లేదని, కేసు నడుస్తుందని ఇలా రకరకాలుగా మాటలు వినిపించడంతో తాము ఆశ్చర్యపోయామని బాధితులు వాపోతున్నారు. కీసర మండలం కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ఘటనలపై బాధిత కుటుంబాలు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అనే మాదిరిగా తమ సమస్య ఉందని బాధితులువేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని లే అవుట్లను మార్చి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments