మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించిన డిటిడిఒ
చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల నిరాహార దీక్ష
ప్రజాపక్షం/మంచిర్యాల ప్రతినిధి తల్లిదండ్రుల ఒడిలో నుండి చదువుకోవడానికి బయటకు వెళ్ళే గుడిలాంటి బడిలో కూడా బాలికలకు రక్షణ కరువైంది. తల్లిదండ్రుల తరువాత స్థానం లో ఉండి ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తున్న అధికారి అసభ్య ప్రవర్తన గిరిజ న ఆశ్రమ పాఠశాల బాలికల్లో భయాన్ని కలిగించింది. బడిలో కూడా బాలికలు బతకడం కష్టమైందని, చదువును వదిలి సొంత ఇంటికి పోదాం అనే ఆలోచన బాలికల మదిలో బలంగా నాటుకుంది. కానీ ఇంటికి వెళ్తే డబ్బులు పెట్టి చదువుకునే స్థాయి నుండి చదువు ‘కొనే’ స్థాయిలో కుటుంబం లేదని జరుగుతున్న ఘటను వెలుగులోకి తెచ్చి న్యాయం కోసం పోరాడాలని బాలికలు నిర్ణయించుకున్నా రు. పోరాటం దిశగా అడుగులు వేశారు. అఘాయిత్యానికి పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి (డిటిడిఓ) విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, మద్యం మత్తులో సాయంత్రం సమయంలో పాఠశాలకు వచ్చి అసభ్యకరమైన పదజాలం వాడుతూ బాలికలతో ఇష్టారీతిగా వ్యవహరించాడని ఆరోపిస్తూ గిరిజన ఆశ్రమ పాఠశాల బాలిక లు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సం దర్భంగా బాలికలు పాఠశాల ప్రధాన ద్వారం ముందు బైఠాయించి అధికారిపై చర్యలు తీసుకునే వరకు తరగతులకు హాజరయ్యేదిలేదని, పాఠశాలలో భోజనం చేయబోమని స్పష్టం చేశా రు. పాఠశాల ఆవరణలో మద్యం మత్తులో వచ్చి తరగతి గది ద్వారాలు, కిటికీలు మూసివేయమని చెప్పి విద్యార్థులనుభయబ్రాంతులకు గురి చేశారని, బాలికలు తరగతి గదుల్లో నృత్యాలు చేయాలని, నృత్యాలు చేసే సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉండరాదని అనడం వారిలో భయాన్ని రేకెత్తించిందని తెలిపారు. గంటల తరబడి ఆశ్రమ పాఠశాల ముందు భోజనం చేయకుండా విద్యార్థులు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న మంచిర్యాల పట్టణ సిఐ ఘటనా స్థలానికి చేరుకుని బాలికలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటా అని హామీ ఇచ్చారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి ఇలాంటి ఘాతుకానికి పాల్పడిన అధికారిని సస్పెండ్ చేసి బాలికల మనోధైర్యాన్ని పెంచాలని విద్యార్థి సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అధికారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం : సిఐ
బాలికల గిరిజన పాఠశాలలోని విద్యార్థులతో అధికారి అసభ్యకరంగా ప్రవర్తించారని బాలికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తామని, భవిష్యత్తులో ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, అధికారిపై నమోదు చేస్తున్న కేసు వివరాలు ఉన్నతాధికారులకు తెలిపి శాఖ పరమైనా చర్యలు తీసుకుంటామని మంచిర్యాల సిఐ నారాయణ నాయక్ విద్యార్థులకు హామీ ఇచ్చి వారి నిరసనను విరమింపచేశారు.
కీచక అధికారిని సస్పెండ్ చేయాలి
RELATED ARTICLES