HomeNewsBreaking Newsకిసాన్‌ సర్కార్‌ వస్తే రెండేళ్లలో వెలుగుజిలుగుల భారత్‌

కిసాన్‌ సర్కార్‌ వస్తే రెండేళ్లలో వెలుగుజిలుగుల భారత్‌

దేశంతోపాటు మహారాష్ట్రలోని మూరుమూల గ్రామాల రూపురేఖలు మార్చి విద్యుత్‌ వెలుగులతో నింపుతాం
బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది 25 లక్షల కుటుంబాలకు దళితబంధు
రైతులు నినాదాలకే పరిమితం కాకుండా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనప్పుడే రైతు రాజ్యం
నాందేడ్‌ బిఆర్‌ఎస్‌ బహిరంగ సభలో పార్టీ అధినేత, తెలంగాణ సిఎం కెసిఆర్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌ కిసాన్‌ సర్కార్‌ను ఎన్నుకుంటే రెండు సంవత్సరాల్లో వెలుగు జిలుగుల భారత్‌ను నిర్మిస్తామని, మహారాష్ట్రలోని మారుమూల గ్రామాల రూపురేఖలు మార్చి, విద్యుత్‌ వెలుగులతో నింపుతామని బిఆర్‌ఎస్‌ అధినేత,ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు మహారాష్ట్ర ప్రజలకు హమీనిచ్చారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రానంతరం కూడా దేశంలో తాగు, సాగు నీరు లేదని, విద్యుత్‌ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని కెసిఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఈ వనరుల లభ్యత లేదా ? ,ప్రజలకు ఈ సౌకర్యాలను సమకూర్చలేమా ? దీని వెనుకున్న మతలబేంటి ?, ఈ విషయాన్ని మనం అర్థ చేసుకోవాలని, ఒకసారి అర్థమయ్యాక అంతా ఏకమవ్వాలని సూచించారు. నాందేడ్‌ రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న గురుగోవింద్‌ సింగ్‌ గ్రౌండ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ‘బిఆర్‌ఎస్‌ బహిరంగ సభ’లో కెసిఆర్‌ పాల్గొన్నారు. అంతకుముందు మహారాష్ట్రలోని పలువురు నాయకులకు బిఆర్‌ఎస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా
కెసిఆర్‌ ప్రసంగించారు. మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ సొంతూరు శివనేరి నుంచి ‘బిఆర్‌ఎస్‌ ఎన్నికల యాత్ర’ను పది రోజుల్లో ప్రారంభిస్తామని, ఈ దేశంలో కిసాన్‌ సర్కార్‌ రావాలని శివాజీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేసి, యాత్రను ప్రారంభిస్తామని వెల్లడించారు. రాబోయే జిల్లా పరిషత్‌,అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించాలని మహారాష్ట్ర ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే ప్రతీ పథకాన్నీ మహారాష్ట్రలో అమలుచేస్తామన్నారు. బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ప్రతీ సంవత్సరం 25 లక్షల దళిత కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున దళితబంధును అందిస్తామని, రైతుబంధును ప్రతీ రాష్ట్రంలో అమలు చేస్తామని హామీనిచ్చారు. ఇది రాజనీతికి సంబంధించింది కాదని, మన జీవన్మరణాలకు సంబంధించిన సవాల్‌ అని, ఇంకా ఎప్పటి వరకు మనం చస్తూనే ఉందామని, ఆత్మహత్య చేసుకునేందుకే మనం పుట్టామా అని ప్రశ్నించారు. రూ.2.5 లక్షల కోట్ల బడ్జెట్‌ కలిగిన తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, రూ.5 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న మహారాష్ట్రలో అమలు చేయలేరా? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర సర్కార్‌ వద్ద ధనం ఉన్నప్పటికీ, వారికి ప్రజా శ్రేయస్సుపై మనసు లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న సంక్షేమాన్ని మహారాష్ట్ర ప్రజలు కూడా అనుభవించాలనుకుంటే గులాబి జెండా పట్టుకుని ‘మీరే నాయకులుగా’ ముందకు రావాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి యాత్ర ప్రారంభమవుతుంది, మహారాష్ట్రలో ఊరూరా బిఆర్‌ఎస్‌ కిసాన్‌ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. తాను కూడా ఉత్తర మహారాష్ట్ర, పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ ప్రాంతాల్లో పర్యటిస్తానన్నారు.
ఒక బటన్‌తో దేశమంతా మారుతుంది
మహారాష్ట్రలో అనేక సమస్యలు ఉన్నాయని, అవన్నీ పరిష్కారం కావాలన్నారు. దళితబంధు దేశమంతా అమలు కావాల్సిన అవసరం ఉందని కెసిఆర్‌ అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందజేస్తామని,దీనికి అందరూ తల్వార్లు తిప్పాల్సిన అవసరం లేదని, కేవలం ఒక్క బటన్‌ నొక్కితే దేశమంతా మారిపోతుందన్నారు. ఒక వైపు మన రైతులు చనిపోతుంటే మరోవైపు రంగు రంగాల జెండాలు. గంటలకు గంటలు అసెంబ్లీ,పార్లమెంటులో ప్రసంగాలతో ఊదర గొడుతున్నారని, ఫలితం మాత్రం శూన్యమన్నారు. రైతుల పొలాల్లో ధాన్యం పండాల్సిన చోట, వారి ఆత్మలు తిరుగాడుతున్నాయని, ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు. మనం ఏకమైతేనే మతం,రంగు రంగుల జెండాలు,కులం పేరుతో రాజకీయ పార్టీల పేరు మీద జరిగే విభజనను ఎదుర్కోగలమని, పిడుగులమై ఎదిరించగలమని, ఇది అసంభవమైన విషయం కాదన్నారు.
ఈ సారి ప్రజలు, రైతులు గెలువాలె
రైతుల కేవలం మాటలు,నినాదాలకే పరమితిమవ్వకుండా ఎమ్మెల్యేలుగా, ఎంపిలుగా ఎన్నికవ్వాలని,అప్పుడే రైతు రాజ్యం నిర్మితమవుతుందని కెసిఆర్‌ పునరుద్ఘాటించారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా పార్టీలు గెలుస్తాయని,రాజకీయ నాయకులు గెలుస్తారని,వచ్చే ఎన్నికల్లో ప్రజలు,రైతులు గెలువాలని, మన సమస్యలకు అదే సమాధానమన్నారు.
ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు కేవలం 20 నుండి 21 వేల టిఎంసిల నీటిని మాత్రమే ఉపయోగించుకుంటున్నామని,మిగిలిన 50 వేల టిఎంసిల నీరు వృధాగా సముద్రాల్లో కలుస్తున్నాయని, ఇవి కేంద్రప్రభుత్వం వెలువరించి గణాంకాలేనని వివరించారు. 50 వేల టింఎసిల నీరు సముద్రల పాలవుతుంటే నాయకులు తమాషా చూస్తున్నారన్నారు.
జలవనరులున్న మహారాష్ట్రలో నీటికి కటకటనా..
అపార జలవనరులున్న మహారాష్ట్రలో నీటికి కటకట ఎందుకని,దీనికి కారకులు ఎవరో ఆలోచించాలని కెసిఆర్‌ కోరారు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతావనిలో కాంగ్రెస్‌ 54 సంవత్సరాలు పాలించిందని, బిజెపి 16 సంవత్సరాలు పాలించిందని, విపి సింగ్‌, చంద్రశేఖర్‌, దేవెగౌడ వంటి నాయకులు సంవత్సరం, సంవత్సరంన్నర, ఎనిమిది నెలలు పాలించి నిష్క్రమించారని గుర్తు చేశారు. దేశ దుస్థితికి కారణమే కాంగ్రెస్‌, బిజెపిలని విమర్శించారు. కాంగ్రెస్‌ పోతే బిజిపి వచ్చిందని, ‘నువ్వెంత అంటే నువ్వెంత అనే ప్రేలాపనలు, విమర్శలు. నువ్వెంత తిన్నావ్‌ అంటే నువ్వెంత తిన్నావ్‌ అనే నిందారోపణలు, నీది ఈ కుంభకోణమంటే, నీది ఈ కుంభకోణం అంటూ పరస్పర విమర్శలు, అంబానీ … అదానీ అంటూ పరస్పర దూషణలే’ అని అన్నారు. ప్రధానమంత్రి మోడీ తెచ్చిన మేకిన్‌ ఇండియా ఒక జోకిన్‌ ఇండియాగా మారిందని ఎద్దేవా చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments