మరో పటిష్ట జట్టుతో భారత్ పోరు
నేపియర్: ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లను విజయవంతంగా ముగించిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు మరో కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మట్టికరిపించిన కోహ్లీ సేన ఇప్పుడు న్యూజిలాండ్‌ను ఢీ కొనేందుకు రెడీ అయింది. ఆసీస్‌తో పోలిస్తే కివీస్ జట్టు చాలా బలంగా ఉంది. కివీస్‌ను వారి హోమ్ గ్రౌండ్స్‌లో ఓడించడం ఆషామాషీ కాదు. ప్రస్తుతం కివీస్ జట్టు వరుస విజయాలతో పటిష్టంగా ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో న్యూజిలాండ్‌ను ఓడించడమంటే భారత్‌కు పెద్ద సవాలే. ఇటీవలే శ్రీలంకతో జరిగిన మూడు సిరీస్‌లను గెలుచుకొని కివీస్ తమ సత్తా చాటుకుంది. టెస్టు, వన్డే, టి20 సిరీస్‌లను న్యూజిలాండ్ ఏకపక్షంగా గెలుచుకుంది. ప్రస్తుతం కివీస్ బ్యాటింగ్, బౌలింగ్ దళం మంచి ఫామ్‌లో ఉంది. గత ఐపిఎల్ సీజన్‌లో అద్భుతంగా రాణించి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఫైనల్స్ వరకు తీసుకెళ్లిన కివీస్ సారథి కేన్ విలియమ్‌సన్ అదే జోరును ఇక్కడ కూడా కొనసాగిస్తున్నాడు. బాధ్యతాయుతంగా ఆడుతూ తమ జట్టును విజయతీరాలకు చేర్చుతున్నాడు. సారథ్యంలో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించాడు. ఇక జట్టు సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. వరస శతకాలతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తున్నాడు. మరోవైపు గుప్టిల్, నికోలాస్, వికెట్ కీపర్ లాథమ్, గ్రాండ్‌హోమ్‌లతో కూడిన పటిష్ట బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. ఇక బౌలింగ్‌లోనూ టిమ్ సౌథీ, ఇష్ సోధి, బౌల్ట్, ఫెర్గ్యుసన్ వంటి క్లాస్ ఆటగాళ్లు ఉండడం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశం. అందుకే న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించడం ఏ జట్టుకైన అంత తెలికేమికాదని విశ్లేషకులు చెబుతున్నారు.
జోరుమీదున్న కోహ్లీ సేన..
ఇక భారత్ విషయానికి వస్తే ప్రస్తుతం భారత జట్టు వరుస విజయాలతో జోరుమీదుంది. ఒకప్పుడు విదేశాల్లో భారత్ రికార్డులు పేలవంగా ఉండేవి. ఫాస్ట్ పిచ్‌లపై భారత బ్యాట్స్‌మెన్స్ ఘోరంగా తెలిపోయే వారు. చిన్న లక్ష్యాన్ని సైతం ఛేదించడంలో ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రస్తుతం విదేశాల్లో కూడా మంచి ప్రదర్శనలతో ఆకట్టుకొంటుంది. గత ఏడాది సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనలో పెద్దగా రాణించకపోయినా తాజాగా ఆసీస్ పర్యటనలో మాత్రం ఇరగదీసింది. ఎంతో కాలంగా భారత్‌కు అందని చారిత్రక విజయాలను కోహ్లీ సేన అందుకుంది. కలిసి కట్టుగా రాణిస్తూ క్రికెట్ రారాజుగా ఎదిగిన ఆస్ట్రేలియాను వారి సొంత మైదానాల్లో చిత్తు చేసి తమ సత్తా చాటుకుంది. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికాగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని భారత్ తమ పూర్తి బలగాలను పరీక్షిస్తూ ముందుకు సాగుతోంది. ఈ పర్యటన తర్వాత టీమిండియా తిరిగి భారత్‌కు వెళ్లనుంది. ప్రపంచకప్‌కు ముందు కోహ్లీసేనకు ఇదే చివరి విదేశీ పర్యటన. తర్వాత భారత్‌లో ఆస్ట్రేలియాతో సిరీస్ జరగనుంది. ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడనుంది. తర్వాత మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరగనుంది. ఈ నెల 23 (బుధవారం) భారత్, కివీస్ మధ్య జరిగే తొలి వన్డేతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టులో పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విదేశాల్లో రాణించడంలో ఇతనికి సాటిలేదు. ఆసీస్ పర్యటనలో కూడా కోహ్లీ మెరుగైన ప్రదర్శన చేశాడు. మరోవైపు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇక సీనియర్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో తన పాత ఫామ్‌ను సాధించాడు. ఇది భారత్‌కు శుభసూచికం. దినేష్ కార్తిక్, కేదర్ జాదవ్‌లు కూడా మంచి ఫలితాలను రాబట్టుతున్నారు. భారత బౌలర్లకు ఎదురులేదు. ఫాస్ట్ పిచ్‌లపై ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. కివీస్ పిచ్‌లు కూడా వీరి పదునైన బౌలింగ్‌కు సహకరిస్తాయని అందరూ భావిస్తున్నారు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, యాజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలతో కూడిన బౌలింగ్ దళం చాలా పటిష్టింగా ఉంది. ఇక న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. ఈ రెండు జట్ల పాతా రికార్డులను చూస్తే.. భారత్‌పై న్యూజిలాండ్‌దే పైచెయ్యి ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 34 వన్డేలు ఆడగా అందులో కివీస్ 21 గెలవగా.. భారత్ 10 మ్యాచుల్లో మాత్రమే నెగ్గింది. రెండు మ్యాచ్‌ల ఫలితాలు తేలలేదు. ఒక మ్యాచ్ టై అయింది. ఇక భారత్, న్యూజిలాండ్ మధ్య మొత్తం ఏడు వన్డే సిరీస్‌లు జరగగా.. అందులో భారత్ ఒక సిరీస్‌ను గెలుచుకోగా.. న్యూజిలాండ్ నాలుగింట్లో విజయం సాధించింది. మరో రెండు సిరీస్‌లు ఫలితం తేలకుండా సమమయ్యాయి. ఈ రెండు జట్ల మధ్య 2014లో చివరి వన్డే సిరీస్ జరిగింది. పాత రికార్డులను పక్కనపెడితే భారత్ ఇప్పుడు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఏ దేశానికైన వెళ్లి వారిని వారి సొంతగడ్డపై ఓడించగల సత్తా టీమిండియాకు ఉంది. ప్రస్తుతం ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌లో ఉన్న టీమిండియా కివీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగనుంది.
కివీస్‌తో కఠిన సవాల్
RELATED ARTICLES