ప్రైవేటు ఆసుపత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా గర్భిణులకు సిజేరియన్లు
ప్రజాపక్షం/గద్వాల జోగులాంబ గద్వాల జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు సాధారణ కాన్పుకోసం వెళ్లే గర్భిణులకు కాసుల కోసం కత్తెర కాటు (కడుపుకోత) వేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి ఎర చూపి వారిలో భయాందోళన కలిగిస్తూ సాధారణ ప్రసవాలను కాదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సిజేరియన్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రవాలను లెక్కకు మించి చేస్తుండగా, ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు 30శాతానికి మించి సిజేరియన్ చేయరాదనే ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తూ 2021 ఏడాదిలో 78 నుంచి 97 శాతం వరకు శస్త్రచికిత్సలు చేశారు.
రూ.15 వేలకుపైగా వసూలు కొందరు గర్భిణులు ప్రసవం కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తే సాధారణ ప్రసవం అయ్యే అవకాశాలున్నప్పటికీ డబ్బుల కోసం సిజేరియన్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది. ప్రసవం అనంతరం ఆసుపత్రి నిర్వహణ స్థాయి బట్టి రూ.15వేల నుంచి రూ.30వేలకుపైగానే వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. మందులతో కలిపి ఖర్చు తడిసి మోపెడవుతోందని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
31శాతం సిజేరియన్ ప్రసవాలు
వైద్యాధికారుల సమాచారం ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 ప్రైవేటు ఆసుపత్రులలో 2021- సంవత్సరంలో మొత్తం 5,924 ప్రసవాలు జరగగా వాటిలో 3,831 సిజేరియన్లు జరగడం గమనార్హం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 6,422 ప్రసవాలు జరగగా వాటిలో 1,423 సిజేరియన్, 4,999 సాధారణ ప్రసవాలు జరిగాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో 31శాతం సిజేరియన్ ప్రసవాలు జరిగితే, ప్రభుత్వాసుపత్రుల్లో 12శాతం మాత్రమే సిజేరియన్ ప్రసవాలు జరిగాయని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు కేవలం 17శాతం మాత్రమే జరిగితే ప్రభుత్వాసుపత్రులలో అత్యధికంగా 40శాతం సాధారణ ప్రసవాలు జరిగాయి.
సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యతనివ్వాలి : చందూనాయక్
“ప్రైవేటు ఆసుపత్రుల్లో తతప్పని సరిగా సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యతనివ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. గర్భిణులకు పరీక్షలు నిర్వహించిన తరువాత ఏదైనా హైరిస్క్ ఉందని నిర్ధారణ అయితే సిజేరియన్ ఆపరేషన్ చేయవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో సీ సెక్షన్ జోలిక వెళ్లాల్సి అవసరం ఉండదు అని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాదారణ కాన్పులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో వాటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. నిబంధనల మేరకు 30శాతం మించి ప్రైవేటు ఆసుపత్రులలో సిజేరియన్ ప్రసవాలు చేయరాదు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం” అని ఇన్‌చార్జ్ డిఎంహెచ్‌ఓ డాక్లర్ చందూనాయక్ ‘ప్రజాపక్షం’ ప్రతినిధికి చెప్పారు.