ఒక మహిళను గౌరవించే విధానం ఇది కాదు..
‘యాదాద్రి, మేడారం’ వెళితే అధికారులెవరూ రాలేదు : గవర్నర్
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం తమిళిసై వ్యాఖ్య
ప్రజాపక్షం న్యూస్ నెట్‌వర్క్ రాజ్‌భవన్‌ను, గవర్నర్‌ను కావాలనే అవమానిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సైందరరాజన్ అన్నారు. “తమిళిసైని కాకపోయినా రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాలి. ఒక మహిళను గౌరవించే విధానం ఇది కాదు” అని గవర్నర్ పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ తమిళిసై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో గురువారం భేటీ అయ్యారు. అనంతరం ఆమె అవమానిస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో చాలా అంశాలపై చర్చించినట్లు చెప్పారు. “గణతంత్ర వేడుకలకు, ఉగాది వేడుకలకు ఎందుకు రాలేదు? ఇదేనా మర్యాద? సిఎం సహా అందరినీ ఆహ్వానించాను. నేను ఆధారాలు చూపిస్తాను. ఇది తమిళిసై సమస్య కాదు, గవర్నర్ కార్యాలయానికి జరుగుతున్న అవమానం. తాను ఎవరినీ విమర్శించడంలేదు. రాజ్‌భవన్, గవర్నర్ విషయంలో తెలంగాణలో ఏం జరుగుతుందో మాత్రమే చెబుతున్నాను. తాను తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తాను. తన విషయంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు, మీడియా అంతా గమనిస్తున్నారు” అని తమిళిసై చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నానని, యాదాద్రి ఆలాయానికి వెళ్లినప్పుడు అధికారులు ఎవరూ తనను కలవలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగాది వేడుకలకు తాను ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించానని, ఎవరూ వేడుకలకు హాజరు కాలేదన్నారు. రాజ్‌భవన్‌కు ఏ పార్టీతోనూ సంబంధం ఉండదని స్పష్టం చేశారు. రాజ్‌భవన్, గవర్నర్‌ను కావాలనే అవమానిస్తున్నారని తమిళిసై అభిప్రాయపడ్డారు. తాను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని, అందరితో స్నేహపూరితంగా ఉండే వ్యక్తినని, రాజ్‌భవన్ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. సిఎం, మంత్రులు, సిఎస్ రాజ్‌భవన్‌కు ఎప్పుడైనా రావచ్చన్నారు. సమ్మక్క సారక్క జారతకు వెళ్ళినప్పుడు తానేమీ వ్యాఖ్యలు చేయలేదని, వారు తనను బిజెపి నేత అని ఎలా అనగలుగుతున్నారని గవర్నర్ ప్రశ్నించారు. అన్ని పార్టీల నేతలను కలిశానని, కానీ బిజెపి నేతలను ఒకటి రెండు సార్లు మాత్రమే కలిశాని చెప్పారు. ఏదైనా ఉంటే తనను అడగాలని, తాను సమాధానం చెబుతానని, అలాగే సిఎస్, డిజిపి ఇతర అధికారులను వచ్చి వివరణ ఇవ్వమనాలన్నారు. భద్రాచలం శ్రీరామనవమి ఉత్సవాలకు ఈ నెల 11వ తేదీన హాజరవుతానని, రోడ్డు మార్గంలోనే వెళ్తానని గవర్నర్ వెల్లడించారు. మేడారం జాతరకు కూడా రోడ్డుమార్గంలో 5 గంటలపాటు ప్రయాణించి వెళ్ళానని, సమ్మక్క సారక్క జాతరకు వెళితే ఏమి జరిగిందో ఎంఎల్‌ఎ సితక్క చెప్పారని గవర్నర్ గుర్తు చేశారు. ఇదిలా ఉండగా అమిత్‌షాతో గవర్నర్ తెలంగాణలో ప్రోటోకాల్ వివాదంపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రోటోకాల్, ఇతర అంశాలను కేంద్ర హోంమంత్రికి వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ బుధవారం ప్రధానిని కలిసి కెసిఆర్ వ్యవహారశైలిపై గవర్నర్ ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నేపత్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రితోనూ గవర్నర్ తమిళిసై భేటీ కావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
కావాలనే…. అవమానిస్తున్నారు
RELATED ARTICLES