లక్ష్మీ బ్యారేజీకి భారీగా చేరుతున్న ప్రాణహిత వరద ఉధృతి
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ 12 గేట్లు ఎత్తివేత
ప్రజాపక్షం/జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి/కాళేశ్వరం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ లక్ష్మి, అన్నారం సరస్వతీ బ్యారేజీలు జళకళను సంతరించుకుని కళకళలాడుతున్నాయి. ఎగువలోని మహారాష్ట్ర ప్రాం తాల్లో కురుస్తున్న వర్షాలతో ఆ ప్రాంతాల నుండి ప్రవహిస్తున్న ప్రాణహిత వరద తాకిడి పెరుగుతుండటంతో మంగళవారం మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ 12 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు తరలిస్తున్నారు. లక్ష్మీ బ్యారేజీలో మొదట 3 గేట్లు ఎత్తిన బ్యారేజీ అధికారులు ఎగువ నుండి వరద ఉధృతి క్రమం క్రమంగా పెరిగి 39వేల560 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో సాయంత్రం 12 గేట్లు ఎత్తి 36 వేల 360 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలింపు కొనసాగిస్తుండగా, లక్ష్మీ పంప్ హౌస్ ఎత్తిపోతల ద్వారా 14 వేల 826 క్యూసెక్కుల నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా తరలిస్తున్నారు. లక్ష్మీ బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 100 మీటర్లకు గాను ప్రస్తుతం 98.90 మీటర్లుగా కొనసాగుతుంది. బ్యారేజీ పూర్తిస్థాయి నిల్వ సామర్థం 16.17 టిఎంసిలు కాగా ప్రస్తుతం 12.778 టిఎంసిలుగా ఉంది.ఇదిలా ఉండగా అన్నారం సరస్వతీ బ్యారేజిలోకి కన్నెపెల్లి లక్ష్మీ పంప్ హౌస్ ఎత్తిపోతల ద్వారా 14 వేల 826క్యూసెక్కుల వరద నీరు బ్యారేజిలోకి చేరుతుండగా సరస్వతి పంప్ హౌస్ నుండి 17 వేల 586 క్యూసెక్కుల నీటిని ఎగువకు తరలిస్తున్నారు. సరస్వతి బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 119 మీటర్లుండగా ప్రస్తుతం 117.70 మీటర్ల వద్ద ఉంది.బ్యారేజీ పూర్తిస్థాయి నిల్వ సామర్థం 10.87 టిఎంసిలకు గాను ప్రస్తుతం 7.96 టిఎంసిల నీటీ నిల్వలతో కొనసాగుతోంది.
కాళేశ్వరానికి జలకళ
RELATED ARTICLES