HomeNewsBreaking Newsకాళేశ్వరం, మేడిగడ్డపై రెండో రోజూ విజిలెన్స్‌ సోదాలు

కాళేశ్వరం, మేడిగడ్డపై రెండో రోజూ విజిలెన్స్‌ సోదాలు

ప్రజాపక్షం/హైదరాబాద్‌/మహాదేవపూర్‌ మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన వ్యవహారంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రెండవ రోజు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఇంజనీరింగ్‌, పోలిస్‌, విజిలెన్స్‌ ప్రత్యేక బృందాలు నీటి పారుదల శాఖ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి, పలు రికార్డులను, విలువైన ప్రతాలను స్వాధీనం చేసుకున్నారు. మొదటి రోజు రాత్రి వరకు సోదాలను నిర్వహించి, రాత్రి మేడిగడ్డ అతిథి గృహంలోనే బస చేసిన అధికారులు బుధవారం ఉదయం మహదేవ్‌పూర్‌ నీటిపారుదల శాఖ కార్యాలయంలో సోదాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌ డిజైన్‌, మేడిగడ్డ బ్యారేజీపైన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టి అధికారుల నివేదిక, పంప్‌ హౌస్‌గోడ కులాలడానిదారి తీసిన పరిస్థితులు, పునరుద్ధరణ పనులు, చెల్లింపులు, వరద నీటి విడుదల తదితర అంశాలపై ప్రత్యేక బృందం ఆరా తీసింది. దీనికి సంబంధించిన దస్త్రాలు, కన్నేపల్లి పంప్‌ హౌస్‌ కార్యాలయాల్లో రికార్డులను విలువైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో సోదాలను నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన వ్యవహారంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దృష్టిసారించింది. మేడిగడ్డ బ్యారేజీ, పంప్‌హౌస్‌కు సంబంధించిన వివరాన్నింటిని అందజేయాలని లేఖ రాసిన 24 గంటలు గడవక ముందే, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు ప్రారంభించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. హైదరాబాద్‌ జలసౌధలోని కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కార్పొరేషన్‌ ఎండి హరిరామ్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, రామగుండం ఇఎన్సీ వెంకటేశ్వర్లు కార్యాలయాల్లో అధికారులు ఉదయం 9గంటల నుంచి 8 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ముందుగా ఫోన్లు స్వాధీనం చేసుకుని, ఎవరిని బయటకు వెళ్లనీయకుండా సంబంధిత సిబ్బంది, ఛాంబర్లలో అధికారులు డాక్యుమెంట్లను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిపోవడంపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని, సిట్టింగ్‌ న్యాయమూర్తి చేత న్యాయవిచారణ జరిపిస్తామని పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా ఇప్పటికే సిట్టింగ్‌ జడ్జిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ రాశారని ఉత్తమ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments