సిద్ధమైన ప్రతిపాదనలు
60 రోజుల్లో 60 టింఎసిల నీటిని ఎత్తిపోయాలని నిర్ణయం
ప్రజాపక్షం/హైదరాబాద్; మహారాష్ట్రలో గోదావరి ఎగువన నిర్మించిన బాబ్లి తదితర ప్రాజెక్టుల కారణంగా గత కొన్నేళ్లుగా ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరులేక వెలవెలబోతోంది. దీని కింద ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో దాదాపు పది లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ ఏడాది పుష్కలంగా కురిసిన వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండింది. అయితే 2017లోనే ఎంతటి వర్షాభావ పరిస్థితుల్లోనైనా శ్రీరాంసాగర్‌ను కళకళలాడించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రివర్స్‌బుల్ ఎత్తిపోతల పథకం ద్వారా దీనిని నింపాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆమోదించింది. వరదకాల్వ ద్వారా కాళేశ్వరం నీటిని ఈ రివర్స్‌బుల్ ఎత్తిపోతల ద్వారా శ్రీరాంసాగర్‌ను నింపడమే ఈ రివర్స్‌బుల్ ఎత్తిపోతల పథకం ఉద్దేశ్యం. అయితే అప్పట్లో దీని నిర్మాణానికి రూ.1000కోట్లు అవుతాయని అంచనా వేశారు. పనుల పూర్తి చేయడంలో జరుగుతున్న జాప్యం, పనుల్లో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా దీని అంచనా వ్యయం క్రమేపి పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం దీనిని పూర్తి చేయడానికి మొత్తం రూ.2వేల కోట్లు అవుతాయని నీటిపారుదల శాఖ అంచనాలు సిద్దం చేసింది. ఈ మేరకు ఈ ఫైలు కూడా సిద్దం అయింది. ప్రభుత్వానికి పంపి ఆమోదం పొం దాల్సి ఉంది. నిజానికి ఈ పనులు ఇప్పటికే పూర్తయి గత ఖరీఫ్ నుంచే రివర్స్‌బుల్ ఎత్తిపోతల ద్వారా శ్రీరాంసాగర్‌ను నింపాలి. అయితే ఈ ఏడాది వర్షాల కురియడంతో ఈ అవసరం ఏర్పడకపోవడం ఒక ఎత్తయితే… పనులు కూడా పూర్తి కాకపోవడం మరో కారణం. ఈ ఎత్తిపోతల పథకానికి ఎస్‌ఆర్‌ఎస్‌పి పునరుజ్జీవం అని పేరు పెట్టారు. దీని వల్ల వరద కాల్వ ద్వారా రోజుకు ఒక టిఎంసి చొప్పున 60రోజులు 60టింఎసిల నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. దీని కోసం మూడు పంప్‌హౌజ్‌ల నిర్మాణాలను ప్రతిపాదించారు. వీటి కోసం5.79లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అవసరం. అయితే నిర్మాణ పనుల్లో జరిగిన మార్పుల కారణంగా ఇది 6.14లక్షల క్యూబిక్ మీటర్లకు పెరిగింది. అలాగే ఈ పనులకు 17,100 టన్నుల స్టీల్ అవసరమని అంచనా వేశారు. దీంతో ఎస్‌ఆర్‌ఎస్‌పి పునరుజ్జీవం అంచనా వ్యయం ఈ ఏడాది జూన్ నాటికే రూ.1751.46కోట్లకు పెంచుతూ నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత మరో రెండు తూముల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. వీటి నిర్వహణకు సంబంధించిన కార్యాలయాలు, సిమెంట్, స్టీల్, ప్రస్తుతం పెరిగిన ఇంధన ధరల కారణగా అంచనా వ్యయం అదనంగా రూ.62.68 కోట్లు అవుతుందని అధికారులు నిర్ణయించారు. వీటి అంచనా కూడా ప్రస్తుతం దాదాపు రూ.135.94 కోట్లు పెరుగుతున్నట్లు అంచనాకు వచ్చారు. మొత్తం మీద రూ.1000కోట్ల అంచనా వ్యయంతో మొదలైన శ్రీరాంసాగర్ రివర్స్‌బుల్ ఎత్తిపోతల( కాళేశ్వరం నుంచి శ్రీరాంసాగర్‌కు నీరందించే పునరుజ్జీవ పథకం) అంచనా వ్యయం రూ.2వేల కోట్లకు పెరిగింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపగానే పనులు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేసుకునేందుకు సమాయుత్తం అవుతున్నారు.