3వ పంపు వెట్ రన్ విజయవంతం
ప్రజాపక్షం/ పెద్దపల్లి : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. నందిమేడారం వద్ద ప్యాకెజీ 6లో నిర్వహించిన మూడు మోటర్ల వెట్ రన్ విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో సిఎం ఒఎస్‌డి దేవ్ పాండే పాల్గొన్నారు. అనంతరం దేవ్‌పాండే మా ట్లాడుతూ ఈ ప్రాజెక్టు విషయంలో కృషి చేసిన అధికారులను అభినందించారు. మిగిలిన ప్రాజెక్టులన్నీ ఇదే ఉత్సాహంతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నందిమేడారం వద్ద ప్యాకెజీ 6 లో భాగంగా నిర్మిస్తున్న పంప్‌హౌస్‌లో 127.6 మెగావాట్ల సామర్ధ్యం గల 7 మోటార్లు అమర్చాల్సి ఉంది. ఇప్పటికి నాలుగు మోటార్ల పనులు పూర్తయ్యాయి. 4వ మోటార్‌ను సైతం వెట్న్‌క్రు సిద్ధం చేశారు. గోదావరి నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యం గా పనులు సాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ను అతి తక్కువ సమయంలోనే ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. గోదావరిపై కాళేశ్వరం వద్ద మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారెజీలను, పంపుహౌస్‌లను నిర్మించి వాటి ద్వారా ఎల్లంపల్లి మీదుగా వివిధ మార్గాల ద్వారా 90 రోజుల పాటు ప్రతి రోజు రెండు టిఎంసిల నీటి చొప్పున తరలించనున్నారు. దాంతో రాష్ట్రంలో నూతనంగా 18 లక్షల ఎకరాలకు సాగునీరు, 18 లక్షల స్థిరీకరణ జరుగుతుందని, ఆ దిశగా పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. నందిమేడారంలో భూగర్భంలో భారీ పంపుహౌస్‌లు, సర్జపుల్, 7 భారీ మోటార్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా కంప్యూటర్ ద్వారా కాళేశ్వరం మూడవ మోటర్ రన్ విజయవంతం కావడం పట్ల అధికారులు, ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు వెంకటేశ్వర్లు, పెంటారెడ్డి, సూర్యప్రకాష్‌లతో పాటు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, సంబందిత అదికారులు తదితరులు పాల్గొన్నారు.