కాళేశ్వరంలో భక్తుల నిలువు దోపిడీ

దశాబ్ద కాలంగా ఒకే వ్యక్తికి టెండర్‌ ఖరారు
అధిక ధరలకు టెంకాయలు, పూజా సామగ్రి విక్రయాలు
ప్రజాపక్షం/ కాళేశ్వరం

జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మనోభావాలకు అనుగుణంగా నిరంతరం భక్తులకు సేవలందిచాల్సిన ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పైసామే…పరమాత్మ. కాసులకు కాదేది అనర్హం’ అన్నట్లుగా పరిస్థితి తయారైందని భక్తులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ, మాహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌లోని వివిధ ప్రాంతాల నుండి క్షేత్రానికి ప్రతి రోజు అధిక సంఖ్యలో తరలివచ్చి అనేక మంది భక్తులు ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, నవగ్రహ, కాలసర్ప, అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు ఆచరిస్తున్నారు. కాగా ఆలయంలో టెండర్లు దక్కించుకున్న విక్రయదారుడు టెంకాయలు, పూజా సామాగ్రిపై అధిక ధరలు వసూలు చేస్తూ భక్తులను నిలువు దోపిడి చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. పూజాసామాగ్రిపై అధిక ధరల విక్రయాలను నియంత్రించాల్సిన ఆలయ అధికారులు అధిక ధరల విక్రయ దందాను చూసి చూడనట్లుగా వ్యవహరించడం పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలోని ఓ ఉద్యోగి టెండర్‌ దారుడికి తొత్తుగా మారి సహకారం అందించడంతో సదరు టెండర్‌ విక్రయదారుడు పూజాసామాగ్రిపై అడ్డూ అదుపులేకుండా భక్తులకు అధిక ధరలకు విక్రయాలు యదేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
టెండర్‌లో జిమ్మిక్కు
కాళేశ్వరంముక్తీశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెంకాయలు, పూజా సామాగ్రి విక్రయాల టెండర్‌ అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దేవస్థానంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న టెండర్‌ గత దశాబ్ద కాలంగా ఒకే వ్యాపారికి దక్కుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుకాణం టెండర్‌ ప్రతి ఏటా ఒకే వ్యాపారికి దక్కుతుండడంపై ఓ ఆలయ ఉద్యోగి కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందు కోసం సదరు వ్యాపారి నుంచి ఉద్యోగికి కైంకర్యంగా ఏటా పెద్దఎత్తున ముడుపులు అందుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో నిర్వహించిన టెండర్‌లో డిపాజిట్‌ సొమ్ము రూ.2 లక్షలే ఉండడంతో చిన్న వ్యాపారులు సైతం టెండర్‌ పోటిలో పాల్గొనేందుకు వీలు కలిగేది. కాగా చిన్న వ్యాపారులు టెండర్‌ పోటీల్లో పాల్గొన్నడం మింగుడు పడని ఆలయ అధికారులు వారికి అడ్డుకట్ట వేసి తమ వ్యక్తికి టెండర్‌ దక్కించే కుట్రలో భాగంగా డిపాజిట్‌ సొమ్మును ఏకంగా రూ.10 లక్షలకు పెంచి టెండర్‌ కట్టిబ్టె ఏర్పాట్లు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయినా టెండర్‌ పాటలో పాల్గొంటున్న ఒక్కరిద్దరూ వ్యక్తులకు అంతో ఇంతో సొమ్ము ముట్టజెప్పి దశాబ్ద కాలంనుండి ఏకచత్రాధిపత్యంగా ఆ వ్యాపారే టెండర్‌ దక్కించుకోవడం షరా మాములుగా మారడం గమనార్హం. ప్రతి ఏటా ఒకే వ్యాపారి టెండర్‌ దక్కుతుండడంతో భక్తులకు అడ్డగోలు ధరలకు అమ్మకాలు జరిపి వారికి అరచేతిలో వైకుంఠం చూపుతున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిబంధనల ప్రకారం పూజా సామాగ్రి దుకాణంలో ధరల పట్టికను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను భక్తులు కోరుతున్నారు.