అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న గ్రామస్తులు
ప్రజాపక్షం / మనోహరాబాద్ మనోహరాబాద్ మండల పరిధిలో కళ్ళకాల్, ముప్పిరెడ్డిపల్లి, కూచారంలలోని పారిశ్రామికవాడల నుండి రాత్రి వేళల్లో విడుదల చేస్తున్న వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యంతో పాటు ఇతర ఘనవ్యర్థాల వల్ల పరిసర గ్రామాల ప్రజ లు రోగాల బారిన పడుతున్నారు. ఎలాంటి బోర్డు లేని కొన్ని పరిశ్రమలకు యథేచ్ఛగా పొగ రూపంవ్యర్థాలను వదలడంతో ప్రజలు తరచూ ముక్కు, గొంతు, శ్వాసకోశ తదితర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో పరిశ్రమల నుంచి వస్తున్న పెద్ద పెద్ద శబ్ధాల వల్ల భయాందోళనకు గురై నిద్ర పట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇదే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశ్రమల వల్ల ప్రజలు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ పిసిబి అధికారులు కానీ కార్మిక శాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని, పరిశ్రమల యజమానుల నుంచి వారు నెలవారీ మామూళ్లు తీసుకోవడమే ఇందుకు కారణమని గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. సమస్యలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కాలుష్యానికి కారణమౌతున్న పరిశ్రమలపై తగిన చర్యలు తీసుకుని తమ ఆర్యోగాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
కాలుష్యం కోరల్లో గ్రామాలు
RELATED ARTICLES