సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తా
ప్రతి ఒక్కరికీ సమయాన్ని కేటాయిస్తా
పేదల సంక్షేమమే టిఆర్ఎస్ ఎజెండా
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కెటిఆర్ బాధ్యతల స్వీకరణ
ప్రజాపక్షం/హైదరాబాద్: పార్టీ కార్యకర్తల్లో తాను ఒకడిగా పని చేస్తానని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వంకుంట్ల తారకరామారావు అన్నారు. రానున్న రోజుల్లో కార్యకర్తలందరికీ సమయాన్ని కేటాయిస్తానన్నారు. పేదల సంక్షేమమే టిఆర్ఎస్ ఎజెండా అన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం ఉదయం 11.55 గంటలకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కెటిఆర్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. అంతకు ముం దు బసవతారకం నుంచి టిఆర్ఎస్ శ్రేణులతో కలిసి కెటిఆర్ భారీ ర్యాలీగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా పాలన కొనసాగుతుందన్నారు. ఎన్నికల్లో టిఆర్ఎస్కు భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. బం గారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న కెసిఆర్‌ను ప్రజలు ఆశీర్వదించారన్నారు. పూర్తి సమయాన్ని ప్రభుత్వ పనులకు కేటాయించాల్సిన బాధ్యత కెసిఆర్‌పైన ఉన్నదని, అందుకే తనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించారన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను తన పూర్తి శక్తి మేరకు పనిచేస్తానన్నారు. టిఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని పునరుద్ఘాటించారు. వందేళ్ల పాటు టిఆర్ఎస్ అజేయశక్తిగా మలి చేందుకు కార్యకర్తల అండతో కృషి చేస్తానని చెప్పారు. పార్టీని సంస్థాగతంగా నిర్మాణాన్ని చేపడుతతామని, అందరి సహాయసహకారంతో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కెటిఆర్‌ను కలిసిన నేతలు :తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలను స్వీకరించిన కెటిఆర్‌ను పార్టీ ముఖ్యులు, ప్రజాప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కొందరు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు కెటిఆర్ ర్యాలీలో పాల్గొన్నారు. కాగా మాజీ మంత్రి టి.హరీశ్‌రావు నేరుగా తెలంగాణ భవన్‌కు వచ్చి కెటిఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్‌అలీ, మాజీమంత్రులు నాయినినర్సింహరెడ్డి,తుమ్మలనాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్,డాక్టర్ లక్ష్మారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎంఎల్ఎ ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు కెటిఆర్‌ను కలిశారు.