ప్రజాపక్షం/హైదరాబాద్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రంలోని 32 జిల్లాల్లో వేలాదిమంది కార్మికులు మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, ఫ్యాక్టరీల గేట్ల వద్ద, పారిశ్రామికవాడల్లో నిరసన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల వద్ద, కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల వద్ద నిరసనలు మారుమోగాయి. నిరసన కార్యక్రమాలు విజయవంతం చేసిన కార్మికులకు, ఉద్యోగులకు, వివిధ కార్మిక సంఘాలకు, కార్మిక నాయకులకు ఎఐటియుసి రాష్ట్ర సమితి అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎస్.బాల్‌రాజ్, వి.ఎస్.బోస్ ఒక పత్రికా ప్రకటనలో అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా కార్మికవర్గం లక్షలాదిగా నిరసన తెలియజేస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం సిగ్గువిడిచి మొండిగా రాజ్యసభలో ప్రతిపక్షం లేని సందర్భంలో కార్మిక బిల్లులు ఆమోదింపజేసుకోవడం అప్రజాస్వామికమన్నారు. పార్లమెంటు విధానానికి ద్రోహం అని, ఈ చర్యను ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వ మొండి, మూర్ఖపు కార్మిక వ్యతిరేక విధానాలపై కార్పోరేటు అనుకూల విధానలపై కార్మికవర్గం ఉద్యమించడానికి సిద్ధం కావాలని ఎఐటియుసి పిలుపునిస్తుందని వారు తెలియజేశారు.
కార్మిక బిల్లులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసన
RELATED ARTICLES