ప్రజాపక్షం / విశాఖపట్నం/ హైదరాబాద్ కార్మిక ఉద్యమానికి పెద్దదిక్కుగా ఉన్న వివి రామారావు (వివిఆర్) మృతిచెందారు. విశాఖపట్నంలో కార్మిక ఉద్యమ నిర్మాణంలో ఎనలేని కృషిచేసిన ఆయన మరణ వార్తను విన్న కార్మిక లోకం కన్నీరుమున్నీరైంది. వివిఆర్‌గా సుపరిచితులైన వేమూరి వెంకట రామారావు తన జీవితాన్ని కారికోద్యమానికి అంకితం చేశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న 75 ఏళ్ల వివిఆర్ విశాఖలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. కృష్ణా జిల్లా కైకలూరు తాలూ కా భైరవపట్నంలో 1947 అక్టోబర్ 7న వేమూరి వెంకటకృష్ణయ్య, సంపూర్ణమ్మ దంపతులకు వివిఆర్ జన్మించారు. బందరు తాలూ కా చిట్టిగూడూరు, గూడూరులో పాఠశాల విద్య, మచిలీపట్నంలో పియుసి, నంద్యాల పాలిటెక్నిక్‌లో సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేశారు. పియుసిలో ఉన్నప్పుడే కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. నంద్యాలలో చదువుతున్నప్పడు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎఐఎస్‌ఎఫ్) అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. వివిఆర్ విద్యార్థి ఉద్యమాల్లోనే కాకుండా కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. చదువు పూర్తికాగానే అప్పటి రాష్ట్ర కార్యదర్శి నీలం రాజశేఖరరెడ్డి సూచన మేరకు విశాఖపట్నం పోర్ట్ యూనియన్‌లో పూర్తికాలం ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు నిర్వహించేందుకు 1971 జనవరిలో విశాఖ చేరుకున్నారు. విశాఖలో పోర్ట్ యూనియన్‌ను శక్తిమంతమైన సంస్థగా తీర్చిదిద్దడంలో వివిఆర్ అనితర సాధ్యమైన పాత్ర పోషించారు. 1971 1974 మధ్య పోర్ట్ యూనియన్ ఆఫీస్ కార్యదర్శిగా పనిచేశారు. 1975లో యూనియన్ కార్యదర్శిగా, 1980లో యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పోర్ట్ ట్రస్ట్ బోర్డులో 1984 మొదలుకొని 25 సంవత్సరాలకు పైగా కార్మిక ప్రతినిధిగా వ్యవహించారు. విశాఖ రేవు చరిత్రలో ఇంతకాలంపాటు ఆ పదవిలో కొనసాగిన గౌరవం వివిఆర్‌దే. ఆయన 30 ఏళ్ళకుపైగా డాక్ లేబర్ బోర్డు సభ్యులుగా కొనసాగారు. విశాఖపట్నంలో 1995లో జరిగిన పోర్టు డాక్ వాటర్ ఫ్రంట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మహాసభలో ఇంద్రజిత్ గుప్తా అధ్యక్షుడిగా, వివి ఆర్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కాగా, ఎఐటియుసిలో సాధారణ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2005లో జాతీయ మహాసభ కార్యదర్శిగా ఎన్నికైనారు. ప్రస్తుతం ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఇక సిపిఐలో విశాఖపట్నం జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, పట్టణ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ర్ట కౌన్సిల్ సభ్యుడుగా, రాష్ర్ట కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఉద్యమ నాయకుడిగా 10 రోజులపాటు విశాఖ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. 1981 విశాఖపట్నం తొలి కార్పొరేషన్ ఎన్నికలలో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. విశాఖ స్టీల్ యూనియన్‌కు గత 10 సంవత్సరాల నుంచి గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. చిట్టివలస జూట్ కార్మికుల యూనియన్‌కు గౌరవాధ్యక్షుడిగా పదేళ్లపాటు సేవలందించారు. కార్మిక ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన వివి ఆర్ మరణంపట్ల సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట కార్యదర్శి కె రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జెవి సత్యనారాయణమూర్తి, కార్యదర్శివర్గ సభ్యులు తదితరులు సంతాపం తెలిపారు.
కార్మిక ఉద్యమానికి లోటు
కామ్రేడ్ వివిఆర్ మరణం కార్మిక ఉద్యమానికి పెద్ద లోటని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ కార్యదర్శివర్గం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సిపిఐ సీనియర్ నాయకుడు, కార్మిక సంఘాల నేత వి.వి. రామారావు మృతిపట్ల ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వర్గం ప్రగాఢ సంతాపం తెలిపింది. ఆయన మరణం కేవలం పార్టీకే కాకుండా దేశంలో కార్మిక ఉద్యమానికి కూడా పెద్దలోటని సిపిఐ తన పత్రికా ప్రకటనలో పేర్కొంది. పార్టీ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులైన వివి ఆర్ తమ న్యాయమైన పోరాటాలకు కార్మికులు, సమాజంలోని పీడితవర్గాల్లో కదలిక తేవడంలో కీలక పాత్ర పోషించారని సిపిఐ ఆయన సేవలను గుర్తుచేసుకుంది. వివి ఆర్ మృతిపట్ల ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులకు సిపిఐ తన సానుభూతి తెలిపింది.
సురవరం, చాడ తదితరులు సంతాపం
రామారావు మరణం పట్ల సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంతాపాన్ని తెలియజేశారు. ఆయన మరణ వార్త తనను చాలా బాధించిందన్నారు. విద్యార్థి రోజుల నుంచే తామిద్దరమూ స్నేహితులమని, ఐదు దశాబ్ధాల పాటు కలిసి పని చేశామని గుర్తుచేసుకున్నారు. గత నెలలోనే రామారావుకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నానని, ఇటీవల ఆయన మనవడి వివాహానికి తనను ఆహ్వానించారని, అకస్మాత్తుగా రామారావు ఆరోగ్యం క్షిణించిందని తెలిపారు. సిపిఐ, కార్మిక యూనియన్లలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. వి వి రామారావు మరణం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శిచాడ వెంకట్‌రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని, రామారావు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. రామారావు పార్టీ,ట్రేడ్ యూనియన్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారని, ట్రేడ్ యూనియన్ జాతీయ నాయకులుగా, పార్టీ జాతీయ సమితి సభ్యులుగా పని చేశారని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల కోసం ఆయన అలుపెరగని పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించారని, రామారావు మరణం పార్టీకి,కార్మిక లోకానికి తీరని లోటు అని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. వివిఆర్ మరమణం కార్మిక వర్గానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఎస్.బాల్‌రాజ్, ప్రధానకార్యదర్శి వి.ఎస్.బోస్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.డి.యూసుఫ్, మాజీ ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌రావులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఢిల్లీలో ఎఐటియుసి కేంద్ర కార్యాలయం భవన నిర్మాణానికి, హైదరాబాదులో రాష్ట్ర ఎఐటియుసి భవన నిర్మాణానికి, విశాఖపట్నం పార్టీ ఆఫీసు భవననిర్మాణానికి, కృష్ణాజిల్లా చల్లపల్లిలో చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రం నిర్మాణానికి కార్మికుల నుండి విరాళాలు సేకరించి భారీ స్థాయిలో రామారావుగారు నిధులు అందజేశారని వారు గుర్తుచేశారు. ఆయన మరణానికి ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర సమితి సంతాపం తెలియజేస్తూ, వారి సహచర ఉద్యమ మిత్రులకు, కుటుంబసభ్యులకు సానుభూతిని ప్రకటించింది.