HomeNewsBreaking Newsకార్పొరేట్‌ శక్తుల చేతుల్లో 90శాతం ఛానల్స్‌

కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో 90శాతం ఛానల్స్‌

‘నివాళి’ సంచిక ఆవిష్కరణ సభలో సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి
వేలెత్తిచూపని వ్యక్తిత్వం రాఘవాచారి సొంతం : వక్
ప్రజాపక్షం/హైదరాబాద్‌
దేశ వ్యాపితంగా జరుగుతున్న మతపర ప్రదర్శనలపైన హిందూ మతాచారులతో తీవ్రమైన వాగ్వివాదాలను పెట్టించి, కోపావేశాలపైన మీడియా పెట్రోల్‌ పోస్తోందని సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. దాదాపు 95 శాతం ఛానల్స్‌ కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో ఉన్నాయని, అందులో అత్యంత ఎక్కువ ఫాసిస్టు, మోడీకి అనుకూలంగా బాధ్యతారహితంగా వ్యవహారిస్తున్నాయని మండిపడ్డారు. ప్రముఖ పాత్రికేయులు, విశాలాంధ్ర పూర్వ సంపాదకులు సి.రాఘవాచారి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అక్షర శస్త్రధారి చక్రవర్తి
రాఘవాచారి సంపాదకీయాల రెండవ సంపుటి “నివాళి” సంచిక ఆవిష్కరణ సభ హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఆదివారం జరిగింది. ఈ పుస్తకాన్ని సురవరం సుధాకర్‌ రెడ్డి ఆవిష్కరించారు. విశాలాంధ్ర సంపాదకులు ఆర్‌.వి. రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా ప్రముఖ నవలాకారులు, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్‌తో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, ‘ప్రజాపక్షం’ ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి సందేశాలు ఇవ్వగా సి.రాఘవాచారి ట్రస్ట్‌, రాఘవాచారి సతీమణి కె.జ్యోత్స తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ రాఘవాచారి ప్రసంగంలో సంపూర్ణ పరిపక్వత ఉండేదని, ఆయన సంపాదకీయాల్లో అత్యధిక భాగం ఇప్పటి పరిస్థితులకూ సంబంధం ఉంటాయని తెలిపారు. టివిలు, పత్రికలు, సోషల్‌ మీడియా ద్వారా ఫాసిజం, తన ప్రచారాన్ని శాస్త్రీయ దృక్ఫథాన్ని, హేతుబద్దమైన ఆలోచన ధోరణికి వ్యతిరేకంగా విష పూరితంగా ప్రచారాన్ని కొనసాగిస్తోందన్నారు. జర్నలిజంలో ఎమర్జెన్సీ కాలంలో పరిస్థితుల కంటే ప్రస్తుతం వంద రెట్లు ఎక్కువగా ఉన్నదని, జర్నలిస్టుల హత్యలు జరుగుతున్నాయని, వారిపై కేసులు నమోదు చేస్తున్నారని, ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమర్జెన్సీ సమయంలో నాటి ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ నిర్వాహకులు గోయంక గట్టిగా నిలబడ్డారని, ఎక్స్‌ప్రెస్‌లో నాడు కమ్యూనిస్టు వార్తలు తక్కువగా, మిగతా వారి వార్తలు ఎక్కువగా ప్రచురితమైనా మిగతా అంశాల్లో స్వతంత్రంగా నిలబడేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం అమానుష పద్ధతులను వ్యవహారిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులది కీలకమైన పాత్ర అని అన్నారు. నేడు పత్రికా స్వేచ్ఛ యాజమాన్యాల చేతుల్లోకి పోయిందని, సొంతంగా పత్రిక పెట్టుకుని స్వేచ్చగా నడిపించినందుకు గౌరీ లంకేష్‌ లాంటి జర్నలిస్టులు ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను కొనసాగిస్తూ, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసిన పత్రిక ప్రయత్నిస్తోందని. ‘విశాలాంధ్ర జాతీయ దిన పత్రిక’ అన్ని ఉద్యమాలను, ప్రజాసమస్యలను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.
అంపశయ్య నవీన్‌ మాట్లాడుతూ రాఘవాచారి తెలుగు, ఇంగ్లీష్‌లో గొప్ప వక్త అని అన్నారు. ఇంగ్లీష్‌ పత్రికలో పనిచేస్తే మంచి గుర్తింపు వచ్చేది కాదా అని తాను రాఘవచారిని అడిగితే, అందుకు ఆయన స్పందిస్తూ ‘విశాలాంధ్ర’ తన హృదయం అని చెప్పినట్టు వివరించారు. రాఘవాచారిది, తనది ఒకే ఊరు అని, కళాశాలలో ఆయన తనకు సీనియర్‌ అని, విద్యార్థి దశలోనే రాఘవాచారి ద్వారా తమకు వామపక్ష భావజాలం పరిచయమైందని, అందుకే తమలో వామపక్ష భావజాలం జీర్ణమైందన్నారు. నిజాం, భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో తమ ఊరు పాలకుర్తి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నదన్నారు. సంపాదకీయం అనేది ఒక కళ అని, రాఘవాచారి సులువైన భాషలో సంపాదకీయాలు రాసేవారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం, వియత్నాం పోరాటం, కశ్మీర్‌లో షేక్‌ అబ్దుల్లా నిర్వహించిన పాత్ర, విప్లవ రచయిత లెనిన్‌ ఇలా అనేక పోరాటాలు, ఉద్యమాలు, రంగాలపై సంపాదకీయాలు రాశారన్నారు.
డాక్టర్‌ కె.నారాయణ మాట్లాడుతూ రాఘవాచారి జీవితం తెరచిన పుస్తకమని, సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఇది వరకు వృత్తి రీత్యా జర్నలిస్టులు ఛానల్స్‌కు మారేవారని, ఇప్పుడు రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారని, ఎప్పుడు ఏ పార్టీల్లో ఉంటారో తెలియడం లేదన్నారు. రాజకీయ వ్యవస్థ మారిందని, నైతిక విలువలు పడిపోయాయని, ఇది అన్ని రంగాల్లో వస్తాయని, కానీ జర్నలిస్టు, రాజకీయ నిబద్ధత కలిగిన వారిలో అలాంటి మార్పులు వచ్చే అవకాశాలే ఉండవని, ఇందుకు ప్రతిబింబం రాఘవాచారి అని అన్నారు.
చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ రాఘవాచారి నిండుదనానికి నిదర్శనమన్నారు. ఆయన రాసిన సంపాదకీయాల్లో ప్రభుత్వానికి హెచ్చరికలు, ప్రజల సమస్యల తరఫున ప్రజాగొంతుకగా, వారి అట్టడుగుల ఆకాంక్షలు ఉండేవాని గుర్తు చేశారు. ఆయన సంపాదకీయాలు నేటి తరానికి ఉపయోగమన్నారు. రాఘవాచారికి అపారమైన పరిజ్ఞానం ఉన్నదని, నిబద్ధత, నిజాయితీ, విలువలు కలిగిన వ్యక్తిత్వం అని అన్నారు. రాఘవాచారి జీవితమంతా ‘విశాలాంధ్ర’కు అంకితమయ్యారన్నారు. విలువులు పడిపోతున్న సమాజంలో నేటి తరానికి రాఘవాచారి సంపాదకీయాలు ఎంతో ఉపయోగమన్నారు.
కె.శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ ఒక వ్యక్తిగా, పార్టీగా, సంపాదకునిగా వేలు ఎత్తి చూపలేరని, అలాంటి వ్యక్తితం రాఘవాచారి సొంతమని అన్నారు. వెయ్యి స్తంభాల వివాదంలో నాడు చిన జియర్‌ స్వామి బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌కు వచ్చిన సమయంలో రాఘవాచారి తన కంటే గొప్పవారని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నేడు యాజమాన్యం ఏం చెబుతుంది, ఏం ఆలోచన విధానం అనే తీరులోనే, ఎవరికీ ఇబ్బంది పెట్టని తరహాలో సంపాదకీయాలు వస్తున్నాయని అన్నారు. కాళోజీ మరణించిన సమయంలో ఆయనపై రాఘవాచారి రాసిన సంపాదకీయం ఎంతో ఆకట్టుకుందన్నారు. నిర్మొహమాటంగా, స్పష్టంగా చెప్పే వ్యక్తిత్వం అని అన్నారు. చండూరు హత్యాకాండ ఘటన నేపథ్యంలో ఆ గ్రామానికి వెళ్లే పరిస్థితులు లేవని, అలాంటి సమయంలో రాఘవాచారితో కలిసి సంపాదకులు, జర్నలిస్టులు ఆ గ్రామానికి వెళ్లామని గుర్తు చేశారు.
ఆర్‌.వి.రామారావు మాట్లాడుతూ అనేక మంది అనుమానాలను రాఘవాచారి నివృత్తి చేసేవారని గుర్తు చేశారు. రాఘవాచారి వేగంగా సంపాదకీయాలు రాసేవారని, ఆయనకు గొప్ప జ్ఞాపకశక్తి ఉండేదని అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments