పరిరక్షణే ధ్యేయంగా విద్యార్థి ఉద్యమాలు
నేటి నుంచి ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర మహాసభలు
ప్రజాపక్షం/ ఖమ్మం
విద్య కార్పొరేట్ శక్తుల చేతిలో బంధి అవుతుంది. విద్యా రంగంలో సానుకూల మార్పులను తీసుకు వచ్చి ప్రతి ఒక్కరికీ విద్యను అందించాల్సిన పాలక వర్గాలు విద్యను వ్యాపారంగా మార్చుకునే శక్తులకు దన్నుగా నిలుస్తున్నాయి. ఒక పక్క ప్రభుత్వ పాఠశాలల మూసివేత, మరోపక్క నియంత్రణ లేని ఫీజుల వ్యవహారంతో విద్యకు సామాన్యులు దూరమవుతున్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ఇప్పటికీ చదువుకోవడానికి సరైన వసతులు , అవకాశాలు లేవు. విద్యార్థులు లేరన్న పేరిట గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను క్రమేపి మూసి వేస్తున్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 2వేల పాఠశాలలు మూతపడనున్న విషయం అందరికీ తెలిసిందే. పాఠశాలల మూసివేతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలక వర్గాలు అవలంభిస్తున్నటువంటి విధానాలే కారణం. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే పూర్తిగా విద్య ప్రైవేటీకరించబడుతుంది. ప్రైవేటీకరించబడిన తర్వాత ఇక పేద, మధ్య తరగతి వర్గాలు చదువుకు దూరం కావడం తప్ప ఫీజులు చెల్లించి చదువుకునే అవకాశం ఉండదు. ప్రైవేటును ప్రోత్సహించడమంటే విద్యకు సామాన్యులను దూరం చేయడమేనన్న వాస్తవాన్ని గుర్తెరగడం లేదు. శాస్త్రీయ విద్యా విధానాన్ని తీసుకు రావాల్సిన పాలక వర్గాలు దానిని మరిచి విద్యా విధానంలో కనీస మార్పులకు ప్రయత్నించడం లేదు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠ్యాంశాలలో మత పరమైన విషయాలను చేర్చి పసి మెదళ్లలో మతాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తున్నది. విద్యా రంగానికి కాషాయికరణ అంటించే ప్రయత్నాన్ని బిజెపి చేపట్టింది. ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం కామన్ విద్యా విధానాన్ని అందించాలని కెజి నుంచి పిజి వరకు నిర్భంధ విద్యను అమలు చేయాలని యావత్ దేశ విద్యార్థి లోకం గొంతెత్తి అరుస్తున్నది. రాను రాను బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులు తగ్గిపోతున్నాయి. శిథిలమవుతున్న భవనాలు పూర్తి స్థాయిలో బోధన సిబ్బంది లేని విద్యా సంస్థలు దేశ వ్యాప్తంగా కోకోల్లలు. అసలు మన విద్యా వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయని వాటిని సవరించాలని డిమాండ్ చేస్తుంటే ఆ లోపాలకు ఊతంగా పాలక వర్గాలు మరికొన్ని చట్టాలను తీసుకు వచ్చి విద్యా వ్యవస్థపై రుద్దుతున్నారు. పేదలకు గురుకులాల ద్వారా విద్యను అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ గురుకుల పాఠశాలల నిర్వహణ మరింత లోపభూయిష్టంగా ఉంది. పురుగుల అన్నం తినలేమంటూ విద్యార్థులు రోడ్లు ఎక్కే పరిస్థితి దాపురించింది. మొత్తం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా విధానం పెను సవాళ్లను ఎదుర్కొంటున్న దశలో అఖిల భారత యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఈనెల 26, 27, 28 తేదీల్లో కొత్తగూడెంలో జరగనున్నాయి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) అంటే ఉత్తేజిత ఉద్యమాలకు ఓ చిహ్నం. 1936 ఆగస్టు 12న లక్నోలో ఆవిర్భావించిన ఏఐఎస్‌ఎఫ్ అటు స్వాతంత్య్ర ఉద్యమంలోనూ స్వాతంత్య్ర అనంతరం విద్యా రంగ సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేసింది. చదువుతూ పోరాడుదాం, చదువుకై పోరాడుదాం అన్న నినాదంతో అనేక ఉద్యమాలను చేపట్టిన చరిత్ర ఏఐఎస్‌ఎఫ్‌కు ఉంది. కోఠారి కమిషన్‌కు వ్యతిరేకంగా 1986లో జాతీయ విద్యా విధానాన్ని తీసుకు వచ్చి విద్యను ప్రైవేటీకరించేందుకు విద్య పేరుతో వ్యాపారం చేసుకునేందుకు అనుమతిచ్చారు. దీనికి వ్యతిరేకంగా పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్. విద్య కాషాయికరణ, ప్రైవేటీకరణ జరుగుతున్న నేటి పరిస్థితుల్లో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర మహాసభల్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించి భవిష్యత్తు కార్యచరణను రూపొందించుకోనున్నారు. ఈ మహాసభల్లో ఏఐఎస్‌ఎఫ్ మాజీ నాయకులతో పాటు ప్రస్తుత ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షులు శుభం బెనర్జీ, జాతీయ కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజన్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏఐఎస్‌ఎఫ్ మాజీ నాయకులు తక్కెళ్ల పల్లి శ్రీనివాసరావు, బాగం హేమంతరావు, ఎస్‌కె సాబీర్‌పాషా తదితరులు పాల్గొననున్నారు. 33 జిల్లాలకు ప్రాతినిథ్యం వహిస్తూ 400 మంది ప్రతినిధులు ఈ మహాసభకు హాజరు కానున్నట్లు నిర్వహకులు తెలిపారు.
కార్పొరేట్ శక్తుల చేతిలో విద్య బందీ
RELATED ARTICLES