HomeNewsBreaking Newsకార్పొరేట్ల సంస్థలకు రూ.10 లక్షల కోట్ల రాయితీలు..రైతులకు రూ.లక్ష కోట్లు లేవా?

కార్పొరేట్ల సంస్థలకు రూ.10 లక్షల కోట్ల రాయితీలు..రైతులకు రూ.లక్ష కోట్లు లేవా?

‘ఇంటింటికీ సిపిఐ’లో కేంద్రాన్ని నిలదీసిన కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
ప్రజాపక్షం/హైదరాబాద్‌
కార్పొరేట్‌ సంస్థలకు ప్రధాని నరేంద్ర మోడీ రూ.10 లక్షల కోట్లు రాయితీలు కల్పించారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. రైతులకు రూ.లక్ష కోట్ల రాయితీలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ‘బిజెపి కో హటావో.. దేశ్‌కో బాచావో’ కార్యక్రమంలో భాగంగా శనివారం బషీర్‌బాగ్‌ నిజాం కళాశాల నుంచి అబిడ్స్‌ మీదుగా మొజాంజాహీ మార్కెట్‌ వరకు ‘ఇంటింటికీ సిపిఐ’ కార్యక్రమం నిర్వహించారు. దారిపొడవున నారా యణతో పాటు సిపిఐ నాయకులు, కార్యకర్తలు కరపత్రాలు పంపిణి చేశారు. ప్రజలకు మోడీ సర్కార్‌ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ధరల పెరుగులదల లాంటి అంశాలను వివరించారు. దారిలో ఉన్న దుకాణాలలో వ్యాపారులు, వినియోగదారులతో నారాయణ
సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను విధ్వంసం చేస్తూ, కార్పొరేట్‌ సంస్థలకు మోడీ కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. పేదల నుంచి సంపన్నుల వరకు వినియోగించే చెప్పులపై కూడా ఐదు శాతం నుంచి 12 శాతానికి జిఎస్‌టిని పెంచారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరితంగా పెరగడానికి మోడీనే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డిజీల్‌ ధరలు విపరితంగా పెరిగిపోయాయన్నారు. రష్యా నుంచి సబ్సిడిపై వచ్చే పెట్రోల్‌, డిజీల్‌ను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించారని అన్నారు. రష్యా చౌకగా వచ్చే రష్యా ఆయిల్‌ను ప్రభుత్వ రంగం ఇంధన సంస్థలకు అప్పగిస్తే, లీటర్‌ పెట్రోల్‌ ధర కేవలం రూ.50 మాత్రమే ఉంటుందన్నారు. చౌక ధరకు వచ్చే రష్యా ఆయిల్‌ అమ్ముకొని ప్రైవేట్‌ సంస్థలు లాభాలు గడిస్తున్నాయని అన్నారు. దీనితో నిత్యావసర వస్తువుల ధరలు విపరితంగా పెరిగిపోయాయని అన్నారు. మోడీ కొనసాగితే సామాన్యులు జీవించలేని పరిస్థితులు నెలకొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఇటి నరసింహ మాట్లాడుతూ పేద, సంపన్న అనే తేడా లేకుండా చివరకు చెప్పులపై కూడా జిఎస్‌టి విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్‌ను సాగనంపాల్సిన సమయం అసన్నమైందన్నారు. కేంద్ర సర్కార్‌ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్‌ నేత ప్రేమ్‌ పావని, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఛాయదేవి, సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, స్టాలిన్‌, రాష్ట్ర సమితి సభ్యులు బి.వెంకటేశం, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్‌. మల్లేష్‌, కాంపల్లి శ్రీనివాస్‌, రాజ్‌ కుమార్‌, జేర్రిపోతుల కుమార్‌, కొమురెల్లి బాబు, ఎఐవైఎఫ్‌ నాయకులు ఆర్‌. బాలకృష్ణ, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు గ్యార నరేష్‌, నాయకులు చైతన్య, కళ్యాణ్‌, సిపిఐ నాయకులు రాజు గౌడ్‌, మహిళా సమాఖ్య నాయకురాలు చక్రిలతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments