20 జిల్లాల్లో కేటాయింపులు శూన్యం
ఇదీ… డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం తీరు
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకం కాగితాల్లో ఘనంగా కనిపిస్తున్నప్పటికీ ఆచరణలో అథమస్థాయిలో ఉంది. కాగితాల్లో లెక్కలు ఆకాశాన్నంటుంతుండగా.. క్షేత్ర స్థాయిలో వాటిని లబ్ధిదారులకు అందించడంలో ఎంత మాత్రం పురోగతి సాధించలేదు. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉండగా, వీటిలో 20 జిల్లాల్లో ఒక్క గృహం కూడా లబ్ధిదారులకు కేటాయించలేదంటే ఈ పథకం అమలవుతున్న తీరు ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి నుంచి ఎంఎల్‌ఎల వరకు ఎక్కడ నోరు విప్పినా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరు, ప్రారంభించిన వాటి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. నిజానికి పరిశీలిస్తే ఈ పథకం తెలంగాణ ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన వెంట నే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. పథ కం ప్రారంభమై ఆరేళ్లు గడిచినా అడుగు ముందుకు పడలేదు. పాలకులు, అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారమే ఈ పథకం అమలు ఏ మేరకు చతికిలపడిందో తేటతెల్లమవుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా కు మొత్తం లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయగా.. వీటిలో అన్ని విధాల పూర్తయినవి కేవలం 7944. లబ్ధిదారులకు అందచేసినవి 128 గృహాలు మాత్రమే. ఈ పథకం కింద రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొత్తం 2,82,416 మందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేశారు. తొలి టర్మ్ ఐదేళ్లు, రెండో టర్మ్‌లో ఒక ఏడాది మొత్తం ఆరేళ్లు పాలన పూర్తి చేసుకున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఇప్పటి వరకు వీటిలో ప్రారంభించినవి 1,79,078 గృహాలు కాగా, పురోగతిలో ఉన్నవి 48,885 గృహాలు. నిర్మాణాలు ప్రారంభించి 1,79,078 గృహాల్లో 96,042 దాదాపు 90 శాతం పూర్తయ్యాయని అధికారులు లెక్కలు చూపిస్తున్న కాగితాల్లో కనిపిస్తున్నాయి. 90శాతం పూర్తయ్యాయి… ఇక రేపో మాపో పూర్తి చేసి కేటాయిస్తారు అని సరిపెట్టుకుందామంటే పూర్తయిన గృహాలను లబ్ధిదారులకు కేటాయిస్తున్న తీరు చూస్తూ వీటిపై ఆశలు పెట్టుకున్న వారు ఉసూరుమనక తప్పదు. కారణం ఇప్పటి వరకు నిర్మాణాలు పూర్తయిన గృహాల సంఖ్య మొత్తం 34,151 కాగా, వీటిలో కేవలం 3,829 గృహాలను మాత్రమే లబ్ధిదారులకు కేటాయించారు. అధికారికంగానే అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం పూర్తయిన గృహాలు, వాటిలో లబ్ధిదారులకు కేటాయించిన వాటి వివరాలు జిల్లాల వారీగా పరిశీలిస్తే ఈ పథకం అమలు ఎంత అథమస్థాయిలో ఉందో అర్థమవుతుంది. జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, వరంగల్ (రూరల్), వరంగల్( టౌన్), నల్లగొండ, యాదాద్రి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేట జిల్లాల్లో ఒక్కరికి కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లును కేటాయించలేదు. మిగిలిన జిల్లాల్లో కేటాయింపులు కూడా వందలు, పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులు, వాటిలో పూర్తయినవి, లబ్ధిదారులకు అందచేసిన వాటి సంఖ్య జిల్లాల వారీగా ఈ క్రింది విధంగా ఉన్నాయి.
కాగితాల్లో ఘనం.. ఆచరణలో అథమం
RELATED ARTICLES