బిజెపిని అడ్డుకునే శక్తిగా ఆవిర్భవించాలి
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పిలుపు
ఫతేహాబాద్ (హర్యానా): కాంగ్రెస్, వామపక్షాలుసహా విపక్ష పార్టీలన్నీ ఏకమై, బిజెపిని అడ్డుకునే శక్తిగా ఆవిర్భవించాలని ఎన్‌డిఎయేతర పార్టీలకు జనతా దళ్ యునైటెడ్ (జెడియు) చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పిలుపునిచ్చారు. మాజీ డిప్యూటీ ప్రధాని దేవీ లాల్ జయంతిని పురస్కరించుకొని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి) ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ లేకుండా బలమైన కూటమి ఏర్పడడం కుదరదని తేల్చిచెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. హిందూ, ముస్లిం మధ్య విభేదాలు సృష్టించడానికి బిజెపి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. వాస్తవానికి హిందూ, ముస్లింల మధ్య ఎలాంటి ద్వేషభావం లేదని వ్యాఖ్యానించారు. అల్లరి మూకలు ఎక్కడైనా ఉంటాయని అన్నారు. 1947 దేశ విభజన సమయంలో అత్యధిక శాతం మంది ముస్లింలు భారత్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు నితీశ్ తెలిపారు. కాంగ్రెస్, లెఫ్ట్ లేకుండా బలమైన ప్రతిపక్ష కూటమి ఏర్పడడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. జాతి విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ పట్ల చాలకాలంగా విభేదాలను మరచి, ఒకటిగా కలవాలని ఆయన అన్నారు. వేదికపై ఐఎన్‌ఎల్‌డి నాయకుడు ఓం ప్రకాశ్ చౌతాలా, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరత్ పవాన్, సిపిఎం నేత సీతారాం ఏచూరి, శివసేన నాయకుడు అరవింద్ సావంత్, ఆర్‌జెడి నాయకుడు, బీహార్ డిప్యూటీ సిఎం తేజశ్వి యాదవ్ తదితరులు ఆశీనులయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎవరూ ఈ ర్యాలీకి హాజరుకాలేదు.
రాజ్యాంగ పరిరక్షణ అత్యవసరం : ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్
కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న విధానాలతో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని, వాటి పరిరక్షణ అత్యవసరమని ఆర్‌జెడి నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అన్నారు. ఐఎన్‌ఎల్‌డి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, జనతా దళ్ యునైటెడ్ (జెడియు) శిలోమణి అకాలీదళ్ (సిఎడి), శివసేన పార్టీలు బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ నుంచి వైదొలగడానికి ప్రధాన కారణం ప్రజాస్వామ్య పరిరక్షణేనని అన్నారు. ఉపాధి కల్పనపై భారీ హామీలిచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ఇప్పుడు ఆ హామీని విస్మరించిందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకేతాటిపై నిలిచి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని ఆయన కోరారు. ప్రజలు కూడా బిజెపి నైజం తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు.
బిజెపిని గద్దెదించే సమయం ఆసన్నమైంది
ఎన్‌సిపి అధినేత శరద్ పవార్
కేంద్రంలోని బిజెపి సర్కారును గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ అన్నారు. ఐఎన్‌ఎల్‌డి ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేసినప్పటికీ మోడీ సర్కారు చాలాకాలం పట్టించుకోలేదని, చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో సాగు చట్టాలను రద్దు చేసిందని అన్నారు. ఆందోళనలో పాల్గొన్న రైతు సంఘాల నేతలపై ఉన్న కేసులు ఎత్తివేస్తామన్న హామీని మోడీ ప్రభుత్వం ఇప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు. సరైన గిట్టుబాటు ధర లేక రైతులు, ఉపాధి అవకాశాలు లభించక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేంద్రంలో స్పందన లేకపోవడం శోచనీయమని పవార్ అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. విభేదాలను పక్కకుపెట్టి, సరికొత్త కూటమి ఏర్పాటుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకేతాటిపైకి రావాలని శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కోరారు. జెడియు, శివసేనతో కలిసి తమ పార్టీ ఎన్‌డిఎ కూటిమిని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఈ కోణంలో చూస్తే నిజమైన ఎన్‌డిఎ తమదేనని వ్యాఖ్యానించారు. బిజెపిని ఓడించడానికి అన్ని పార్టీలు ఒకేతాటిపైకి రావాలని ఆయన సూచించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్‌డిఎ ఓటమి ఖాయమని బాదల్ జోస్యం చెప్పారు.