HomeNewsTelanganaకాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులుగా రేణుక, అనిల్‌కుమార్‌

కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులుగా రేణుక, అనిల్‌కుమార్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌ రాజ్యసభ ఎంపి అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ బుధవారం ప్రకటించింది. తెలంగాణతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్‌ జాబితాను కూడా కాం గ్రెస్‌ హైకమాండ్‌ విడుదల చేసింది. తెలంగాణ నుంచి మాజీ ఎం.పి రేణుకాచౌదరి, సికింద్రాబాద్‌ మాజీ ఎం.పి అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తనయుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేర్లను ఖరారు చేసింది. అలాగే కర్ణాటక నుంచి అజయ్‌ మాకెన్‌, సయ్యద్‌ నాసీర్‌ హుస్సేన్‌, జి.సి. చంద్రశేఖర్‌లను ఎంపిక చేసింది. మధ్యప్రదేశ్‌ నుంచి అశోక్‌ సింగ్‌కు చోటు కల్పించింది. అయితే తెలంగాణ నుంచి రెండు స్థానాలను కూడా రాష్ట్రానికి చెందిన నేతలకు అవకాశం ఇవ్వాలని కేంద్ర కాంగ్రెస్‌ హై కమాండ్‌ నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ సభ్యుల విషయంలో అనూహ్యంగా అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేరు తెరపైకి వచ్చింది. యువతను ఆకట్టుకునే విషయంలో అనిల్‌కు కాంగ్రెస్‌ అధిష్ఠానం అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. వీరి అభ్యర్థిత్వాలకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆమోదం తెలిపారని ఎఐసిసి వెల్లడించింది. మరోవైపు రేణుకా చౌదరి రాజ్యసభకు వెళ్తుండటంతో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఎవరికి దక్కుతుందనే విషయంపై కాంగ్రెస్‌లో ఆసక్తి నెలకొంది.
కాంగ్రెస్‌ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిసిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌రాజ్యసభ సభ్యుడిగా తనను ప్రకటించడంతో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానానికి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తన లాంటి యువకుడికి అధిష్ఠానం రాజ్యసభ అవకాశం ఇవ్వడం అనందంగా ఉందన్నారు. కష్టపడే వారికి కాంగ్రెస్‌లో పదవులు దక్కుతాయనడానికి ఇదే ఉదాహరణ అని చెప్పారు. తనకు పదవి ఇవ్వడం యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల కృషి అని తెలిపారు.
వెంకట్‌కు ఎంఎల్‌సి, తనకు రాజ్యసభ ఇవ్వడంతో కాంగ్రెస్‌ యువకులకు ఇస్తున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాజ్యసభ అవకాశం ఇస్తారని తన జీవితంలో ఊహించలేదని చెప్పారు. కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి తేవడమే ఎఐసిసి అగ్రనేత రాహుల్‌ గాంధీ లక్ష్యమని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు.
బిఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవీచంద్ర
బిఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవీచంద్రను పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ పెద్దలు, ముఖ్యులతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈనెల 15వ తేదీన వద్దిరాజు రవీచంద్ర రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments