పలువురి అభినందనలు
అంతిమ తీర్పుకు కట్టుబడతా : శశిథరూర్
పార్టీని ఉమ్మడిగా కొత్త శిఖరాలకు తీసుకెళతాం
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షపదవి మల్లికార్జున ఖర్గేకే దక్కింది. ఖర్గేకు రికార్డుస్థాయిలో 7,897 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి జి నాయకులలో ఒకరైన శశిథరూర్‌కు 1,072 ఓట్లు లభించాయి. దీంతో ఖర్గే 24 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబేతర అధినేతగా తెరమీదకు వచ్చినట్లయింది. కొత్తగా అధ్యక్ష పదవికి ఎన్నికైన ఖర్గేకు నా అభినందనలు,పార్టీ ప్రతినిధులు ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పు, దానికి కట్టుబడి ఉంటాను” అని శశిథరూర్ పేర్కొన్నారు. మొత్తం 9,385 మంది పిసిసి ప్రతినిధులు తమ ఓటుహక్కు ఉపయోగించుకున్నారు. వీటిల్లో 416 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల అథారిటీ అధికారి మధుసూదన్ మిస్త్రీ బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలోని ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలను వివరించారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలలో పోలింగ్‌పై శశిథరూర బృందం చేసిన ఫిర్యాదులను మిస్త్రీ ప్రస్తావిస్తూ తనకు రాసిన ఈ ఫిర్యాదు లేఖలపై అంశాలవారీగా తాను వివరణ ఇస్తానని చెప్పారు. తనకు వచ్చిన ఈ ఫిర్యాదు లేఖల్లో ఆరోపణలకు సరైన పునాదులు లేవని ఆయన పేర్కొన్నారు. ‘137 ఏళ్ళ కాంగ్రెస్‌పార్టీ చరిత్రలో ఈ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి.
ఖర్గే ఇంటికి సోనియాగాంధీ
కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలుగా 22 ఏళ్ళపాటు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన సోనియాగాంధీ, పార్టీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక విజేతగా నిలిచిన మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్ళారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు. సోనియాగాంధీ వెంట పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా కూడా వెళ్ళారు. కొత్త అధ్యక్షుగా ఆయన త్వరలో బాధ్యతలు చేపడతారు. శశిథరూర్ కూడా మల్లికార్జున ఖర్గేను కలిసి అభినందనలు తెలియజేశారు. పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరం కూడా ఆయనకు అభినందనలు తెలియజేశారు.
నిజమైన సైనికుడిలా పనిచేస్తా : ఖర్గే
కాంగ్రెస్‌పార్టీకి ఒక నిజమైన సైనికుడిలా పని చేస్తానని మల్లికార్జున ఖర్గే అన్నారు. పార్టీలో పెద్ద చిన్న అనే తరతమ భేదాలు లేవని, పార్టీలో అందరూ సమానమేనని భారీఓట్లతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికైన అనంతరం ఖర్గే చెప్పారు. “మేం అందరం సమైక్యంగా కలిసి పనిచేస్తాం, పార్టీని సంస్థాగతంలో పటిష్టం చేయడం కోసం నిజమైన సైనికుల్లా కలిసి పనిచేస్తాం” అని అన్నారు. ఈనెల 26వ తేదీన ఖర్గే పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, పార్టీలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా సమానమేనని, ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి పెను ప్రమాదంగా మారిన ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా తమ పార్టీ కార్యకర్తలందరం కలిసి పనిచేస్తామని అన్నారు. దేశంలో ప్రజల హక్కులపైన, ప్రజాస్వామ్యంపైన దాడులు చేసేవారిపై మేం పోరాటం చేస్తాం అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రాహుల్‌గాంధీ ఫోన్ ద్వారా తనకు అభినందనలు తెలియజేశారని చెప్పారు.
కొత్త అధ్యక్షుడే నా బాధ్యతలు నిర్ణయిస్తారు : రాహుల్
ఆదోని (ఆంధ్రప్రదేశ్) : కాంగ్రెస్‌పార్టీలో తన పాత్ర ఏమిటో, తన బాధ్యతలు ఏమిటో కొత్తగా అధ్యక్ష పగ్గాలు చేపట్టబోయే నాయకుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయిస్తారని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. భారత్ జోడోయాత్రలో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలల్లో పాదయాత్ర పూర్తిచేసి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించిన రాహుల్‌గాంధీ ఆదోనిలో బుధవారం పాత్రికేయులతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌పార్టీలో అధ్యక్షుడే సర్వోన్నత నిర్ణయాధికారి అని, పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో ఆయనే నిర్ణయిస్తారని అన్నారు. “ఇక మీదట మీ పని విధానాన్ని అధ్యక్షుడికే తెలియజేయాలా?” అని పాత్రికేయుడొకరు ప్రశ్నించగా, అది సర్వసాధారణ విషయమని సమాధానం చెప్పారు. “పార్టీలో అధ్యక్షుడే అధినాయకుడు, ప్రతివారు తమ పనితీరును ఆయనకే నివేదించవలసి ఉంటుంది, నేను చాలా స్పష్టతతో ఉన్నాను, పార్టీ అధ్యక్షుడే నాకు తగిన బాధ్యతలు అప్పగిస్తారు, నన్ను పార్టీలో ఏ కర్తవ్యాలకు ఉపయోగించుకోవాలో ఆయనదే నిర్ణయం” అని వ్యాఖ్యానించారు. ఒక సందర్భంలో రాహుల్ “అది ఖర్గే నిర్ణయిస్తారు” అని ఆ తర్వాత సర్దుకుని, అధ్యక్ష పదవిలో ఎవరు ఉంటే వారే నిర్ణయిస్తారు” అన్నారు. ఖర్గే, థరూర్ ఇద్దరు చాలా సీనియర్ నాయకులని, వారికి తన సలహా అవసరం లేదని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పార్టీ పోలింగ్‌లో అవకతవకలుజరిగాయని శశిథరూర్ ఆరోపణలపై ప్రశ్నించగా, పార్టీకి ఒక వ్యవస్థాగతమైన చట్రం ఉందని, సంబంధిత విభాగం ఆ సమస్యలను పరిశీలిస్తుందని అన్నారు.మా పార్టీకి ఒక ఎన్నికల సంఘం ఉందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పగ్గాలు మల్లికార్జున ఖర్గేకే
RELATED ARTICLES