HomeNewsBreaking Newsకాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి అక్టోబర్‌ 17న ఎన్నికలు

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి అక్టోబర్‌ 17న ఎన్నికలు

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం
న్యూఢిల్లీ :
కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం ఎన్నికల నిర్వహణపై గత కాలంగా కొనసాగుతున్న అనిశ్చితి, ఉత్కంఠకు తెరపడింది. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్ష పదవికి అక్టోబర్‌ 17న ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆదివారం నిర్ణయించింది. ఎన్నికలకు సంబంధించి సెప్టంబర్‌ 22న నోటిఫికేషన్‌ జారీకానుండగా, అదే నెల 24 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామపత్రాల సమర్పణ ప్రక్రియ సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు కొనసాగనుంది. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికల నిర్వహణ తేదీలను నిర్ణయించేందుకు కాంగ్రెస్‌ వర్కింట్‌ కమిటీ (సిడబ్ల్యుసి) ఆదివారం వర్చువల్‌గా సమావేశమైంది. దాదాపు 30 నిమిషాల పాటు ఈ సమావేశం జరగగా, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్ట్రీ మీడియాకు వెల్లడించారు. ఒకరి కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేస్తే ఎన్నిక అనివార్యం కానుంది. అక్టోబర్‌ 17న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నిక జరిగే అదే నెల 19వ
తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కెసి వేణుగోపాల్‌ చెప్పారు. పార్టీ సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌ రాజీనామాతో కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలిన నేపథ్యంలో కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణయాధికారి సంస్థ సమావేశం కావడం గమనార్హం. రెండు రోజుల క్రితం గులామ్‌ నబీ ఆజాద్‌ కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తూ లేఖను అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. పార్టీ సంప్రదింపుల యంత్రాంగాన్ని రాహుల్‌ గాంధీ సర్వనాశనం చేశారని ఆజాద్‌ తీవ్ర విమర్శలు చేశారు. కాగా, సోనియగాంధీ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు సిడబ్ల్యుసి వర్చువల్‌గా సమావేశమైంది. ప్రస్తుతం సోనియా వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె వెంట కుమారుడు, కుమార్తె, పార్టీ అగ్రనేతలైన రాహుల్‌, ప్రియాంక కూడా ఉన్నారు. జి అసమ్మతి గ్రూపులో భాగస్వామిగా ఉన్న ఆనంద్‌ శర్మ సహా మాజీ ప్రధాని మనోహ్మన్‌సింగ్‌, పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్ట్రీ, కెసి వేణుగోపాల్‌, కేంద్ర మాజీమంత్రులు జైరామ్‌ రమేష్‌, ముకుల్‌ వాస్నిక్‌, పి. చిదంబరం, రాజస్థాన్‌ సిఎం అశోక్‌ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ సమావేశంలో పాల్గొన్నారు. అయితే మొదటగా పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల ప్రక్రియ మరో వారం పాటు జాప్యమయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్‌ 7వ తేదీనుంచి కన్యామూరి నుంచి కశ్మీర్‌ వరకు నిర్వహించే ‘భారత్‌ జోడో యాత్ర’పై పార్టీ దృష్టి సారించిందని, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు పూర్తి కాలేదని చెప్పాయి. ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 20 మధ్య కొత్త పార్టీ అధ్యక్షుడి కోసం ఎన్నిలు నిర్వహించనున్నట్లు గత ఏడాది అక్టోబర్‌లోనే కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇదిలా ఉండగా, అశోక్‌ గెహ్లాట్‌ సహా అనేకమంది పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టాలని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో సిడబ్ల్యుసి సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments