సంవత్సరానికో ముఖ్యమంత్రి గ్యారంటీ
11 సార్లు అవకాశం ఇచ్చినా ఏంచేశారు?
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
ప్రజాపక్షం/హైదరాబాద్ ‘పొరపాటున లేదా గ్రహ పాటునో కాంగ్రెస్ అధికారంలోనికి వస్తే ‘రైతు బంధుకు రాంరాం, దళితబంధుకు జై బీమ్, సంవత్సరానికో ముఖ్యమంత్రి’ పక్క గ్యారంటీ’ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. ప్రజలు ఇప్పటికే 11 సార్లు అవకాశం కల్పించినా ఏమీ చేయని కాంగ్రెస్, మరోసారి అవకాశమివ్వాలనడం విడ్డూరమన్నారు. మోడీ ప్రభుత్వ భ్రమల నుంచి ప్రజలందరూ బయటపడుతున్నారన్నారు. బిజెపి కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్న సత్యనారాయణ కెటిఆర్ సమక్షంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కెటిఆర్ గులాబి కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అబద్దాలను ప్రచారం చేస్తోందని, కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చిన కర్నాటక రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోనికి వస్తే రాష్ట్రంలో మళ్లీ తాగు నీటి కష్టాలు, ఎరువులు, విత్తనాల కోసం దుకాణల ముందు నిలబడడం రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు డబ్బులిస్తే తీసుకుని, ఓటు మాత్రం బిఆర్‌ఎస్‌కు వేయాలని ప్రజలను కోరారు. కేంద్రలోని బిజెపి ప్రభుత్వం ప్రజలకు చెప్పుకోదగ్గ పని ఏదీ చేయలేదని, అందుకే తిమ్మిని భమ్మి చేసి మరోసారి అధికారంలోనికి వచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. మతం పేరుతో చిచ్చుపెట్టి, ఆ మంటలతో చలికాల్చుకోవాలని బిజెపి ప్రయత్నించడం
దౌర్భగ్యమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం ఒక్కోక్కటి గా విక్రయిస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిందని, మోడీ సింగరేణి సంస్థకు శత్రువు అని విమర్శించారు. తనను ప్రధానిని చేస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తానని చెప్పిన మోడీ, అధికారంలోనికి వచ్చిన తర్వాత సిలీండర్ రూ.12వందలు అయ్యిందని, ఇందుకు బిజెపి ప్రభుత్వానికి డిపాజిట్లు రాకుండా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ల కాలంలో కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏనాడూ ఆదుకోలేదన్నారు.ఈ మంత్రి పువ్వాడ అజయ్ కమార్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోనికి వస్తే‘రైతు బంధు’కు రాంరాం
RELATED ARTICLES