కూటమిలో సమన్వయ లోపం
కెసిఆర్ ముందస్తు అడుగులు వేసి మంచి విజయం సాధించారు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్ : పథకం ప్రకారమే కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు అడుగులు వేసి మంచి విజయం సాధించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆయన సిపిఐ తరపున శుభాకాంక్షలు తెలిపారు. మఖ్దూంభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాడ వెంకట్ రెడ్డి మాట్లాడారు. ముందస్తు ఎన్నికల ఫలితాలపై తమ స్థాయిలో విశ్లేషణ జరుపుకున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలున్నా ప్రజా కూటమిలో సమన్వయం లేకపోవడం, సిపిఐ పోటీ చేసిన స్థానాల్లో కాంగ్రెస్ సహకరించక పోవడం, గతంలో ఎన్నడూ లేని విధం గా విచ్చల విడిగా డబ్బు, మద్యం పం పిణీ, చంద్రబాబు నాయుడు ప్రచారాన్ని తెలంగాణ ఆంధ్రతో ముడిపెట్టి కెసిఆర్ సెంటిమెంట్‌ను రాజేశారని చాడ అన్నారు. కూటమి ఏర్పాటు సరైన సమయంలోనే జరిగినా సీట్ల సర్దుబాటులో జాప్యం జరుగడం వల్ల ఇబ్బందులు వచ్చాయని నామినేషన్ల ఉపసంహరణ నాటికి కూడా సర్దుబాటులు చేసుకునే పరిస్థితి కి కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శించారు. ప్రజాకూటమి ప్రణాళికలోని కొన్ని అంశాలను కెసిఆర్ కాపి కొట్టి తమ పథకాలుగా ముద్రవేసుకున్నారని, ప్రజా కూటమి మాత్రం తమ ఎజెండాను ప్రజల్లోకి సకాలంలో తీసుకెళ్ళలేక పోయిందని చాడ తెలిపారు. ఒక్క ఖమ్మం జిల్లా మాత్రమే కూటమికి అండగా నిలిచిందన్నారు. ప్రజా కూటమిని ఇప్పటికైనా సమన్వయ పరిచి మరింత పటిష్ఠం చేసి రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్కు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తర తెలంగాణలో పరిస్థితి టిఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉండిందని, టిఆర్ఎస్ అభ్యర్థుల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత చూస్తే టిఆర్ఎస్ సగం స్థానాలు కోల్పోతుందని భావించామన్నారు. అయితే కెసిఆర్ సెంటిమెంట్ రాజేసి వ్యతిరేకతను అధిగమించినట్లు వివరించారు.
లెఫ్ట్‌కు ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరం : అసెంబ్లీలో వామపక్షాలకు ఒక్క సీటు లేకపోవడం దురదృష్టకరమని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. 1999 తర్వాత ఈ ఇప్పడాపరిస్థితి దాపురించిందన్నారు. దీనిని గుణపాఠంగా స్వీకరిస్తున్నామన్నారు. సిపిఐ ప్రజా కూటమితో, బిఎల్‌ఎఫ్‌తో సిపిఎం వెళ్ళాయని, వామపక్షాల్లో ఐక్యత లేకుండా పోయిందన్నారు. ఇవిఎ ల ట్యాంపరింగ్ జరిగందనిపిస్తుందని, చాలా చోట్ల ఫిర్యాదులు వచ్చాయన్నారు. పెద్ద సంఖ్యలో ఓట్లు జాబితా నుండి తొలగించారని, తెలిపారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమయ్యిందని విమర్శించారు. తెలంగాణ రాజకీయ భవిష్యత్తు ఒక వ్యక్తి చేతుల్లోకి వెళ్ళిందని, ఆయన ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించలేదన్నారు.సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంటక్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని, ప్రజా కూటమి పడిన కష్టానికి ఈ ఫలితాలు అద్దం పడుతున్నాయన్నారు. కూటమి ఎన్నికల ప్రణాళిక కూడా ప్రజలకు చేర్చని దుస్థితి లో కూటమి ఉందన్నారు. సర్దుబాటులో ఆలసయ్యం చేసి ఏమి చాధించారో కాంగ్రెస్ చెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో సిపిఐ మిత్ర ధర్మాన్ని పాటించిందని, తమకు కేటాయించిన మూడు స్థానాల్లో మిత్ర ధర్మాన్ని పాటించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమయ్యిందని చెప్పారు. కూటమి సమన్వయంతో పనిచేస్తే టిఆర్ఎస్ ఓట్లను 10 శాతం మేరకు తగ్గించగలిగే వాళ్ళమన్నారు. సిపిఐ పోటీ చేసిన మూడు సీట్లలోనూ ఒంటరి పోరాటం చేసిందని చెప్పారు. విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా పాల్గొన్నారు.