ప్రజాపక్షం / హైదరాబాద్ త్వరలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానాల్లో పోటీ విషయంలో కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులు డైలమాలో పడ్డారు. మొదట్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపినప్పటికీ, మారిన పరిస్థితుల నేపథ్యంలో బరిలో ఉండాలా లేదా అని ఆలోచనలో పడ్డారు. ఒకవైపు టిఆర్‌ఎస్ తమ నాయకులకు టార్గెట్లు ఇచ్చి ఓటర్లను నమోదు చేయిస్తుండడం, మరోవైపు వామపక్షాలు ఇప్పటికీ ఇరు స్థానాల్లో తాము బలపరిచే అభ్యర్థుల పేర్లు ప్రకటించడం, ప్రతిపక్షంలో ఒకరిద్దరు కంటే ఎక్కువ మంది బలమైన అభ్యర్థులు ఉండడమే ఇందుకు కారణం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానాలకు జనవరి, ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశముంది. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైనప్పటికీ, ఆ వెంటనే జరిగిన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎంఎల్‌సి గ్రాడ్యుయేట్ స్థానం నుండి మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి అనూహ్యంగా భారీ మెజారిటీతో గెలవడంతో అనేక మంది కాంగ్రెస్ నేతల్లో గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సిగా పోటీ చేయాలనే ఆశ కలిగింది. అందుకు అనుగుణంగానే తాజాగా రెండు గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది. రెండు స్థానాల నుండి 60 వరకు దరఖాస్తులు వచ్చాయి. దీనిని బట్టి పోటీ ఎంతగా ఉందో అర్థమవుతోంది. అయితే, అభ్యర్థులను ముందే ప్రకటించకుండా, తొలుత ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఆశావాహులను, పార్టీ నేతలతను కాంగ్రెస్ ఆదేశించింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఎంఎల్‌సి జీవన్‌రెడ్డిని చైర్మన్‌గా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసింది. కాని ఈ ప్రక్రియ కాంగ్రెస్‌లో ఆశించిన స్థాయిలో సాగడం లేదు. వరుసగా గ్రాడ్యుయేట్ , టీచర్ ఎంఎల్‌సి స్థానాల్లో ఓటమి పాలవుతూ వస్తున్న టిఆర్‌ఎస్ మాత్రం ఈ సారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎంఎల్‌ఏలు, మంత్రులు, ఎంఎల్‌సిలు, స్థానిక ప్రజాప్రతినిధులకు టార్గెట్‌లు విధించి మరీ ఓటర్ల నమోదు ప్రక్రియను సాగిస్తున్నది. వారి దూకుడు చూస్తుంటే గతంలో కంటే ఓటర్ల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో నాయకులంతా దుబ్బాక ఉప ఎన్నికపైనే దృష్టి సారించారు. ఆ పార్టీలో ముగ్గురు నలుగురు మినహా ఆశావహులెవ్వరూ ఉత్సాహంగా ఓటర్ల నమోదు ప్రక్రియ చేపడుతున్న దాఖలాలు లేవు. ఇక వామపక్షాలు రెండు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ , రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానం నుంచి మాజీ ఎంఎల్‌సి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నుంచి సిపిఐ అభ్యర్థి బి.జయసారధిరెడ్డికి మద్దతును ప్రకటించాయి. వెన్వెంటనే అభ్యర్థి తరుపున ఎన్నికలు జరిగే జిల్లాల్లో సన్నాహక సమావేశాలు, ఓటర్ల నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాయి. ఒక విధంగా వామపక్షాలు ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించాయని చెప్పుకోవచ్చు. నల్లగొండ స్థానం నుంచి టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ కూడా ఇప్పటి నుంచి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. రెండు స్థానాల్లో బిజెపి గతంలో ఒక స్థానం నుంచి గెలుపొందగా, మరో చోట రెండో స్థానంలో నిలిచింది. దీంతో పాటు ఆ పార్టీ కూడా ఓటర్ల నమోదు విషయంలో ఇన్‌ఛార్జ్‌లు వేసి, విస్తృతంగానే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు ఓటర్ల నమోదులో చురుకుగా వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ వైపు నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. పైగా నమోదుకు కేవలం పది రోజులే మిగిలి ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ ఆశావహులు పోటీ గురించి సందిగ్ధంలో పడ్డారు. ఇతర ప్రతిపక్ష పార్టీలు ముందుండడంతో పాటు, తమ అభ్యర్థిత్వం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకే ప్రకటించే అవకాశం ఉండడంతో తమకు ప్రచారానికి సరిపడ సమయం లభించదేమోనని భావిస్తున్నారు. పైగా ప్రతిపక్షాల్లో కూడా బలమైన అభ్యర్థులే పోటీలో ఉన్న కారణంగా ఓట్ల చీలిక తమకు ఇబ్బంది అవుతుందేమోననే సందేహిస్తున్నట్లు తెలిసింది. అందుకే మొదట్లో పోటీపై చూపించిన ఉత్సాహం ఇప్పుడు చూపించడం లేదని పార్టీ వర్గాల సమాచారం.
కాంగ్రెస్ పార్టీ ఆశావహులడైలమా!
RELATED ARTICLES