బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు
పాట్నా : త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు కొలిక్కివస్తున్నాయి. మహాకూటమిలో పార్టీల సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేయనుండగా, వామపక్షాలు 30 స్ధానాల్లో తలపడనున్నాయని మహాకూటమి వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌కు 70 స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించిన ఆర్‌జెడి ఆయా స్ధానాల ఎంపికను మాత్రం ఆ పార్టీకి విడిచిపెట్టేందుకు అంగీకరించలేదని తెలిసిం ది. మరోవైపు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని పాలక ఎన్‌డిఎ సైతం సీట్ల ఖరారుపై భాగస్వామ్య పక్షాలతో పాట్నాలో కీలక భేటీ నిర్వహించింది. ఎన్‌డిఎ తరపున సీట్ల పంపకాలను ఈనెల 4లోగా ఢిల్లీలో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇక అధికారాన్ని నిలుపుకునేందుకు ముఖ్యమంత్రి, జెడి(యు) చీఫ్ నితీష్ కుమార్ తనదైన వ్యూహాలకు పదునుపెట్టారు. 2015లో తన విజయానికి బాటలుపరిచిన ఏడు సూత్రాల కార్యక్రమం 2.0ను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగారు. ఓట్ల వేటలో ఈ పథకం తనకు కలిసివస్తుందని ఆయన భావిస్తున్నారు. కాషాయ కూటమితో జతకట్టిన నితీష్‌ను ఈసారి ఎలాగైనా గద్దెదించాలనే లక్ష్యంతో ఆర్‌జెడి, కాంగ్రెస్, వామపక్షాలు మహాకూటమిగా ముందుకొచ్చాయి. ఇక బీహార్‌లోని 71 స్థానాలకు తొలి విడత పోలింగ్‌కు అప్పుడే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బీహార్‌లో 243 అసెంబ్లీ స్ధానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఇసి వెల్లడించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.
కాంగ్రెస్‌కు 70, లెఫ్ట్‌కు 30 సీట్లు
RELATED ARTICLES