టిఆర్‌ఎస్‌లో అంతర్మధనం
‘క్రాస్’పై పల్లా ఆగ్రహం.. ఇబ్బందులు తప్పవని హెచ్చరిక
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో శాసనమండలి ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. వంద ఓట్లకు అటుఇటుగా సాధించాల్సిన కాంగ్రెస్ ఏకంగా 242 ఓట్లను సాధించి టిఆర్‌ఎస్ అంతర్మథనానికి గురయ్యేలా చేసింది. ఖమ్మం స్థానిక సంస్థల ఎంఎల్‌సి నియోజకవర్గంలో మొత్తం 768 మంది ఓటర్లు ఉండగా వారి లో టిఆర్‌ఎస్‌కు 498, కాంగ్రెస్‌కు 116, సిపిఐకి 34, సిపిఐ(ఎం)కు 26, న్యూ డెమాక్రసీకి 15, టిడిపి15 ఓట్లు ఉండగా మిగిలి న వారు స్వతంత్రులు. 2019 స్థానిక సంస్థ ల ఎన్నికల తర్వాత జరిగిన రాజకీయ మార్పుల్లో టిఆర్‌ఎస్ బలం 500 దాటింది. ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్ నిర్వహించిన క్యాంపునకు సైతం 500 మందికి పైగా ఓటర్లు వచ్చారు. సిపిఐ కూడా టిఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చింది. వంద ఓట్ల దగ్గర ఆగాల్సిన కాంగ్రెస్‌కు సుమారు 150 ఓట్లు క్రాస్ అయ్యాయి. వైరా, పాలేరు, కొత్తగూడెంతో పాటు అశ్వారావుపేట నియోజకవర్గాలలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఆరోపణ లు వస్తున్నాయి. అశ్వారావుపేట నియోజక వర్గంలో ఒక మండలంలో మొత్తం 13 ఓట్లు ఉండగా 10 కాంగ్రెస్‌కే పడినట్లు పోలింగ్ రోజు నుంచి ప్రచారం జరిగింది. ఎంఎల్‌ఎలపై వ్యతిరేకత క్రాస్ ఓటింగ్‌కు దారితీసిం ది. ఎంఎల్‌ఎల ప్రధాన అనుచరులపై ఉన్న వ్యతిరేకతతో కొందరు ఎంపిటిసిలు కాంగ్రెస్‌కు ఓటేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తన పార్టీకి చెందిన వారితో పాటు టిఆర్‌ఎస్‌కు చెందిన ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిందని, అందుకే క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం కూడా జరుగుతున్నది. ప్రలోభమే టిఆర్‌ఎస్ ఓటర్లను కాంగ్రెస్ వైపునకు తిప్పిందని కొందరు వాదిస్తున్నారు. అన్నింటికి మించి టిఆర్‌ఎస్‌లో పలు గ్రూపులు, వర్గాలు ఉన్నాయి. స్థానిక సంస్థల శాసనమండలి స్థానాన్ని పలువురు ఆశించారు. అందులో టిఆర్‌ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వారందరిని కాదని టిఆర్‌ఎస్ అధిష్టానం తాతా మధుసూదన్‌కు టిక్కెట్ ఇచ్చింది. టిక్కెట్ ఆశించి భంగపడిన వారు పార్టీకి సహకరించలేదని ప్రత్యర్థులతో చేతులు కలిపారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత, స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకపోవడం, ఎంపిటిసి, జెడ్‌పిటిసిలకు కనీస గౌరవం ఇవ్వకపోవడం వల్లనే కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఇది నిజమైతే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నట్లే. ఎన్నికల ఇంచార్జిగా ఉన్న ఎంఎల్‌సి పల్లా రాజేశ్వరరెడ్డి లెక్కింపు అనంతరం మాట్లాడుతూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టిఆర్‌ఎస్ నాయకులకు ఎవరు క్రాస్ ఓటింగ్ చేయించారో తెలుసా అన్నది చర్చనీయాంశమైంది. నామినేప్ప్రిక్రియ మొదలైనప్పటి నుండీ టిఆర్‌ఎస్ నుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని ప్రచారం చేశారు. పార్టీ దృష్టిలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన దోషులు ఎవరన్నది తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఖమ్మంలో జరిగిన క్రాస్ ఓటింగ్‌పై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరా తీశారని సమాచారం. 2018 ఎన్నికలలోనూ ఒకరికి ఒకరు వెన్నుపోటు పొడుచుకోవడం వల్లనే టిఆర్‌ఎస్ ఓడిపోయిందని కెసిఆర్ అప్పుడే చెప్పారు. మూడేళ్ల తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడం గమనార్హం. తాతా మధుకు టిక్కెట్ కేటాయింపు సందర్బంగా కెసిఆర్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఇక పార్టీలో తమకు స్థానం లేదని భావించిన నాయకులే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారా అన్న దానిపై చర్చ సాగుతున్నది. మొత్తంగా ఖమ్మం జిల్లాలో జరిగిన క్రాస్ ఓటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్‌కు 150 క్రాస్ ఓట్లు!
RELATED ARTICLES