హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో మద్దతివ్వాలని సిపిఐకి టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి
ప్రజాపక్షం / హైదరాబాద్ : హుజూర్‌నగర్ శాసనసభ నియోకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో తమకు మద్దతునివ్వాలని సిపిఐని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు టిపిసిసి అధ్యక్షుడు, ఎంపి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం మఖ్దూంభవన్‌కు వచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహా య కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు తక్కెళ్ళపల్లి శ్రీనివాస్‌రావుతో ఆయన సమావేశమయ్యారు. వచ్చే నెలలో జరిగే హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కి మద్దతునివ్వాల్సిందిగా సిపిఐ నాయకులకు ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సిపిఐ రాష్ట్ర నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీ లో సోమ, మంగళవారాల్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయని, అనంతరం హుజూర్‌నగర్ విషయంపై పార్టీ కార్యదర్శివర్గం, కార్యవర్గంతో సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామని భేటీ అనంతరం ఆయన మీడియాకు వెల్లడించారు.