బిజెపిలో చేరిన పొంగులేటి సుధాకర్‌రెడ్డి
ప్రజాపక్షం/ హైదరాబాద్: ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసి ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో ఢిల్లీలో ఆదివారం బిజెపిలో చేరారు. అంతకుముందు ఆయన తన రాజీనామా లేఖను ఎఐసిసి అధ్యక్షులు రాహుల్‌గాంధీకి పంపించారు. అనంతరం పొంగులేటి సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు కమర్షియల్‌గా మారుతున్నాయని, ఎఐసిసిలో, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, రాష్ట్ర నాయకత్వం కూడా డబ్బులను ప్రమాణికంగా చూస్తున్నారని, ఎంపి, ఎంఎల్‌ఎల పోటీకి డబ్బు అనేది ప్రమాణికంగా మారిందని, అందుకు తాను కలత చెంది, తప్పని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. క్రికెట్ టీమ్ ఓడిపోతే నాయకత్వం, ప్లేయర్స్‌ను మారుస్తారని, అలాంటిది సొంత తప్పిదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే, దీనిని ఇవిఎంలపై నెపం నెట్టారని పేర్కొన్నారు. అదే లోపాలు, అదే నాయకత్వంతో మరోసారి లోక్‌సభ ఎన్నికలకు వెళ్తున్నారన్నారు. దేశ స్వాతంత్య్రం, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ తమ ప్రాథమిక సూత్రాలను, విలువలను, కార్యకర్తల మనోభావాలను రాను రాను మారుతున్నాయన్నారు. మధ్యవర్తులు, దళారులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోని వ్యవహార శైలిని గత కొంత కాలంగా తాను కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా అనేక విషయాలను కాంగ్రెస్ దృష్టికి తీసుకెళ్లినా దిద్దుబాటు చర్యలు తీసుకోలేదన్నారు. తాను అనేక విషయాలపై కలత చెంది భారమైన హృదయంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేశానన్నారు. మోడీ నాయకత్వంలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగస్వామి అవుదామని తాను బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. పుల్వామా దాడి తర్వాత టెర్రరిజంపై కొందరు రకరకాలుగా మాట్లాడారని, అసలు దాడి జరిగిందా అని కొందరు, లెక్క చెప్పాలని మరి కొందరు మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏదీ ఆశించకుండా బిజెపిలో చేరుతున్నానన్నారు. తనకు ఎలాంటి స్వార్థ ఉద్దేశం లేదని, కమర్షియల్ రాజకీయాలు, నాయకత్వం దిద్దుబాటు చర్యల వైఫల్యంతోనే తాను పార్టీని వీడానని వివరించారు. తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని ఆయన కోరారు.