HomeNewsBreaking Newsకాంగ్రెస్‌లో మాటల చిచ్చు

కాంగ్రెస్‌లో మాటల చిచ్చు

ఒకరి ప్రకటన.. మరొకరు ఖండన
నేతల తీరుతో విస్తుపోతున్న ప్రజలు
మంటలు రేపుతున్న రేవంత్‌ మాటలు

‘మూడు ఎకరాలు ఉన్న రైతులు 95 శాతం ఉన్నారు. వారికి మూడు గంటల విద్యుత్‌ ఇస్తే సరిపోతుంది. అలాగే ఉచితంగా కేవలం ఎనిమిది గంటల విద్యుత్‌ ఇస్తే చాలు’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి మాటలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. ఇక విద్యుత్‌ పై ప్రకటన ఇలా ఉంటే సీతక్క కూడా ముఖ్యమంత్రి కావచ్చునన్న రేవంత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు పలువురు మండిపడ్డారు. ఆదివాసీలేందుకు దళితులే ముఖ్యమంత్రులు కావాలని కొందరు, భట్టి లేదా దామోదర్‌ రాజనర్సింహా కావాలని మరికొందరు బహిరంగ ప్రకటనలు చేశారు. మొత్తానికి అమెరికాలో రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి.


ప్రజాపక్షం/ఖమ్మం
కాంగ్రెస్‌ పార్టీని ఎవరు ఓడించలేరు. కాంగ్రెస్‌ నాయకులు తప్ప అన్న నానుడి చందంగానే కాంగ్రెస్‌ పార్టీ నాయకులను ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు. అందుకు కాంగ్రెస్‌ నాయకులే ఉన్నారన్నవిధంగా తయారైంది రాష్ట్ర కాంగ్రెస్‌ పరిస్థితి. కాంగ్రెస్‌లో ఒక నేత ప్రకటించడం, అలా కాదు ఇలా అంటూ మరో నేత దానిని ఖండించడమో, వక్రీకరించడమో జరుగుతుంది. అమెరికా పర్యటనలో ఉన్న పిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి విద్యుత్‌ సరఫరాకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యథిక శాతం ఎత్తిపోతలు లేదా విద్యుత్‌ మోటార్ల సహయంతో వ్యవసాయం చేస్తున్న పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డి మాటలు రైతాంగానికి ఇబ్బందిగా మారాయి. మూడు ఎకరాలు ఉన్న రైతులు 95 శాతం ఉన్నారని వారికి మూడు గంటల విద్యుత్‌ ఇస్తే సరిపోతుందని అలాగే ఉచితంగా కేవలం ఎనిమిది గంటల విద్యుత్‌ ఇస్తే చాలంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం లేపాయి. 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తుంటే దానిని కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మరింత మెరుగు పరిచి నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తామని చెప్పాల్సిన రేవంత్‌ అసలు ఇన్ని గంటలు విద్యుత్‌ సరఫరా ఎందుకంటూ ప్రశ్నించడం రాజకీయ విమర్శలకు దారితీసింది. బిఆర్‌ఎస్‌తో పాటు రాష్ట్రంలోని రైతు సంఘాలు, కాంగ్రెస్‌ వ్యతిరేక పార్టీలు భగ్గుమన్నాయి. పలుచోట్ల రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేశారు. రాష్ట్రంలో పలువురు మంత్రులు రేవంత్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్‌ మాటలను కాంగ్రెస్‌ పార్టీకి అపాదించి కాంగ్రెస్‌ పార్టీకి వ్యవసాయం బాగుండటం ఇష్టం లేదని అందుకే ఇటువంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌ మాటలను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా ఖండించి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 24 గంటల విద్యుత్‌ సరఫరా ఉచితంగా అందిస్తామని ప్రకటించాల్సి వచ్చింది. రేవంత్‌రెడ్డి మాటలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. ఇక విద్యుత్‌ పై ప్రకటన ఇలా ఉంటే సీతక్క కూడా ముఖ్యమంత్రి కావచ్చునన్న రేవంత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు పలువురు మండిపడ్డారు. ఆదివాసీలేందుకు దళితులే ముఖ్యమంత్రులు కావాలని కొందరు, భట్టి లేదా దామోదర్‌ రాజనర్సింహా కావాలని మరికొందరు బహిరంగ ప్రకటనలు చేశారు. మొత్తానికి అమెరికాలో రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. కాస్త కాంగ్రెస్‌కు ఊపు వచ్చిందని ఆ పార్టీ నాయకులు సంబురపడుతున్న వేళ ఇప్పుడు వ్యాఖ్యల దుమారం కాంగ్రెస్‌ పార్టీని దోషిగా నిలబెట్టింది. మరీ ఇటువంటి వ్యాఖ్యల నుంచి బిఆర్‌ఎస్‌ విమర్శల నుంచి సొంత పార్టీ నేతల ఎత్తిపొడుపుల నుంచి కాంగ్రెస్‌ ఎలా ముందుకు సాగుతుందో చూడాల్సి ఉంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments