అసలైన ప్రత్యర్థి ఓటమిపైనే గురిపెట్టాలి
వాయనాడ్‌లో రాహుల్‌గాంధీ పోటీపై డి.రాజా హితవు
ఆయన ఒక రాష్ట్రానికే పరిమితమైన నాయకుడు కాదు
అభ్యర్థిని ప్రకటించడం పార్టీకి ఉన్న హక్కే
కానీ ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటి?
న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీ కేవలం ఒక రాష్ట్రానికి మాత్ర మే పరిమితమైన నాయకుడు కాదని సిపిఐ ప్రధాన కార్యదర్శి డిరాజా వ్యాఖ్యానించారు. కేరళ వాయనాడ్ నుండి సిపిఐ తన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తన మొదటి జాబితాలో వాయనాడ్ అభ్యర్థిగా రాహుల్‌గాంధీ పేరు ప్రకటించడంపై డి.రాజా స్పందించారు. “ఇండియా కూటమి” భాగస్వామిగా ఎన్నికల్లో అసలైన ప్రత్యర్థి ఎవరో, ఎవరిని ఎన్నికల్లో ఓడించాలో కాంగ్రెస్‌పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాలని డి.రాజా హితవు చెప్పారు. ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి ఏ అభ్యర్థి పోటీ చేయాలనే విషయం నిర్ణయించడానికి రాజకీయపార్టీలకు విశేషాధికారం, స్వతంత్ర హక్కు ఉన్నప్పటికీ, జాతీయ నాయకుడుగా రాహుల్‌గాంధీకి ఉన్న స్థాయిని బట్టి బిజెపిని ఎదుర్కొనేందుకు దేశంలో ఎక్కడి నుండైనా ఆయన పోటీ పడగలుగుతారని డి. రాజా శనివారం వ్యాఖ్యానించారు. “మొదటి విషయం ఎల్డిఎఫ్ కూటమి భాగస్వామ్య పార్టీగా సిపిఐ పొందిన నాలుగు సీట్లకు గాను వాయనాడ్ నుండి కూడా పార్టీ పోటీ చేస్తున్నది, రెండో విషయం తమ అభ్యర్థిని ప్రకటించే హక్కు, విశేషాధికారం ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది, కానీ మన ప్రత్యర్థి ఎవరో స్పష్టంగా నిర్ణయించుకోవాలి” అని పేర్కొంటూ, రాహుల్‌గాంధీ కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదన్నారు. కేరళలోని వేనాడ్ నియోజకవర్గానికి ప్రస్తుతం రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం మహిస్తున్నారు. ఆయన అక్కడి నుండి పోటీ చేసే అవకాశం లేదనే వార్తలు బలంగా వినిపించాయి. డి.రాజా సతీమణి, పార్టీ జాతీయ నాయకురాలు, మహిళా సమాఖ్య జాతీయ నాయకురాలు అన్నీ రాజా వేనాడ్ నుండి పోటీ చేస్తారని కాంగ్రెస్‌కంటే ముందుగానే సిపిఐ ప్రకటన చేసింది. సిపిఐ రెండూ ‘ఇండియా’ కూటమి భాగస్వాములు కావడంతో, రాహుల్ అభ్యర్థిత్వం ఖరారు చేయడంపై డి.రాజా పాత్రకేయులతో మాట్లాడారు.“రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను నిర్వహించారు, అది చాలా ఆహ్వానించదగిన మంచి విషయం, ఇప్పుడు ఆయన భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నారు, బిజెపి సైద్ధాంతిక భావజాలమే భారదేశంలో ప్రజలమధ్య అనైక్యతకూ, అస్థిరతకూ కారణం అని రాహుల్‌గాంధీ ఈ న్యాయ యాత్రలో ప్రజలకు చెబుతున్నారు, అసలు అలాంటి భావజాలం బిజెపి మాత్రమే, అసలు ఇప్పుడు మన దేశంలో ప్రజల హక్కులను తిరస్కరిస్తున్న పార్టీ ఏదీ? బిజెపి కూటమే, మరి అలాంటప్పుడు ఈ పరిస్థితుల్లో వేనాడ్ నుండి ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న రాహుల్‌గాంధీ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నట్లు? ప్రజలకు ఎవరు న్యాయాన్ని తిరస్కరిస్తున్నట్లు?” అని డి.రాజా ప్రశ్నించారు. ఆ భావజాలం కాషాయ కూటమికే పరిమితమైనదని ఆయన గుర్తుచేశారు.
బీహార్ పరిణామాలతో బిజెపి నాయకుల్లో బెంబేలు
బీహార్‌లో పరిస్థితులపై కూడా డి.రాజా మాట్లాడారు. “కేవలం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాత్రమేకాదు, బీహార్‌లో జరుగుతున్న పరిణామాలపై బిజెపిలో నాయకులు అందరూ భయభ్రాంతులవుతున్నారు, ఈ మధ్య ఒక ర్యాలీలో పాల్గొనేందుకు నేను బీహార్‌లో గడిపాను, మేం చాలా భారీ ర్యాలీ నిర్వహించాం, లక్షలాదిమంది ప్రజలు వచ్చారు, బిజెపి నితీశ్ కుమార్‌ను తీసుకుపోయింది, తన గుప్పెట్లో పెట్టుకుంది, కానీ ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు, బీహార్ రాష్ట్రాన్ని, దేశాన్నీ రక్షించుకునే విషయంలో ఆ రాష్ట్రంలో ప్రజలకు చాలా స్పష్టత ఉంది, వారు బిజెపి ఎన్‌డిఎ కూటమికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి పోరాటం చేయాలని నిశ్చయించుకున్నారు” అని డి.రాజా చెప్పారు. “అమిత్ షా, మోడీ ఇద్దరికీ దేశ ప్రజల జీవన సమస్యలమీద, వారికి మేలు చేసే విషయంపైనా ఏ మాత్రం అవగాహన లేదు, వారు దేశంలో ప్రజలను విభజించాలని చూస్తున్నారు, దేశంలోని ఇతర ప్రాంతాలలో కులగణన చేయడానికి వారు ఎందుకు ఇష్టపడటం లేదు, వారి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో కుల గణనకు ఎందుకు అంగీకరించడంలేదు? మోడీ షాలకు దేశంలో ప్రజలు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న జీవన సమస్యలు ఏమిటో తెలియవు” అని డి.రాజా విమర్శించారు. ఇండియా కూటమిలో జమ్మూ కశ్మీరులో ఉన్న భాగస్వామ్యపార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలమధ్య విభేదాల గురించి ప్రశ్నించగా, “పిడిపి, నేషనల్ కాన్ఫరెన్స్ రెండింటి మధ్యా ఉన్నది ప్రత్యక్షమైన వివాదమని నేను అనుకోవడంలేదు, సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఐతే కొన్ని సమస్యలు ఉన్నమాట నిజమే, ఇతర రాష్ట్రాలలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా ఉన్నాయి, అదే అంతిమం కాదు, ఉత్తర ప్రదేశ్‌లో కొన్ని అవగాహనలు కుదిరాయి, కానీ ఇంకా అవగాహనల దిశగా వెళుతున్నారు, మనం ఎదురుచూడాలి, ప్రతిపార్టీకీ తమ సొంత ప్రయోజనాలు ఉంటాయి, వాటిని చర్చలతో పరిష్కరించుకోవాలి” అని డి.రాజా అన్నారు.
కాంగ్రెస్‌పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాలి
RELATED ARTICLES