129 మంది మృతి.. పరారీకి ఖైదీల ప్రయత్నం..
కిన్‌షాద (కాంగో): కాంగో రాజధాని కిన్‌షాదాలోని ఓ జైలులో జరిగిన తొక్కిసలాట ఏకంగా 129 మంది ప్రాణాలను హరించింది. పలువురు తీవంగా గాయపడ్డారు. జైలు నుంచి తప్పించుకోవడానికి ఖైదీలు ప్రయత్నించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు అంటున్నారు. దేశాధ్యక్షుడి భవనానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మకాలా సెంట్రల్ జైలులో సోమవారం తెల్లవారు జామున ఒక్కసారిగా అలజడి రేగిందని, పలువురు ఖైదీలు పారిపోయేందుకు జరిపిన ప్రయత్నంలో తొక్కిసలాట చోటు చేసుకుందని కాంఓలీస్ ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి జాక్వెమిన్ షాబానీ ప్రకటించారు. నిజానికి ఆ జైలులో గరిష్టంగా 1,500 మంది ఖైదీలను ఉంచవచ్చు. కానీ, వివిధ కేసుల్లో ముద్దాయులుగా ఉన్నవారితోసహా సుమారు 12,000 మందిని అధికారులో జైల్లో ఉంచారు. వీరిలో ఎక్కువ మంది కేసు ఇంకా విచారణకు కూడా రాలేదు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా పలు మానవ హక్కుల సంఘాలు కాంగోలో జైళ్ల పరిస్థితిపై పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశాయి. మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతున్నదని విమర్శించాయి. జైళ్ల నుంచి పారిపోవడానికి ఖైదీలు ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అనేక సందర్భాల్లో ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఈ స్థాయిలో తొక్కిసలాట చోటు చేసుకొని వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం మాత్రం అరుదు. తాజా ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులు ఇంకా ఎలాంటి నిరాఇ్ధరణకు రాలేదు. అయితే, ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జైలులోని ఒక వార్డులో కాల్పుల మోత వినిపించిందని ఖైదీలు అంటున్నారు. కొద్ది మంది ఖైదీల మధ్య ఘర్షణ చెలరేగి, ఆ క్రమంలోనే పారిపోయే ప్రయత్నం జరిగిందని కొందరు అనుమానిస్తుండగా, పరారయ్యేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారని కొంత మంది వాదిస్తున్నారు. వాస్తవాలు వెలికిరాకపోయినప్పటికీ, జైలులో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం, అర్ధాకలితో రోజులు గడపడం వంటి పరిస్థితులపై ఖదీలు ఆగ్రహంతో ఉండడం వంటి అంశాలు ఖైదీల పరీరాయత్నానికి కారణమై ఉండవచ్చన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. ఇలావుంటే, జైలులో తొక్కిసలాట ఘటనపై కాంగో ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పరిస్థితి అదుపులోనే ఉందని ప్రకటించింది. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేసింది.