పెట్టుబడిదారులు, ప్రభుత్వాల శ్రామిక వ్యతిరేక విధానాలే ఈ ధైన్యస్థితికి కారణం
సోషలిజం కోసం పోరాటానికి పునరంకితం కావాలి కొవిడ్ -19 మహమ్మారి రోజుల్లో మేడే నూతన సందేశం
మే డే ఒక పర్వదినం. అది శ్రమ, దేశాల సంపద సృష్టికర్తలైన శ్రమజీవుల వేడుక దినం. అది శ్రామిక ప్రజల బలాన్ని, కార్మిక కర్షక మైత్రిని, ట్రేడ్ యూనియన్‌లు లేబర్ ఉద్యమాల ఐక్యతను ప్రదర్శించే దినం. అది జాతీయంగా, అంతరాతీయంగా సంఘీభావం వ్యక్తం చేసే దినం. కొవిడ్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. పెద్ద ఎత్తున నిరుద్యోగం, దారిద్య్రం, ఆకలి, నిస్పృహ కారణంగా అది ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నది. ఆర్థిక అసమానత పెరుగుతున్నందున పరిస్థితులు మరింత క్షీణిస్తున్నాయి. ప్రపంచమంతటా పేదలు, శ్రమజీవులు కష్టాల కడగండ్లలోకి నెట్టబడుతున్నారు, లాక్‌డౌన్ భారం వారి నెత్తికి ఎత్తబడుతున్నది. ఈ పరిస్థితి శ్రమజీవులముందు, వారి రాజకీయ, ట్రేడ్ యూనియన్ సంస్థల ముందు అతిపెద్ద సవాలు ఉంచుతున్నది.
మేడే కి మహోజ్జల చరిత్ర ఉంది. 1886 మే నెలలో 8 గంటల పనిదినాన్ని డిమాండ్ చేసిన శ్రమజీవుల వీరోచిత పోరాటానికి చికాగోలోని హే మార్కెట్ సాక్షీభూతమైంది. పెట్టుబడిదారులు ప్రైవేటు ఆస్తిగా ఉత్పత్తి సాధనాలను హక్కుభుక్తం చేసుకున్నంత మాత్రాన, తమకు మిగులు ఉత్పత్తి చేసే నిమిత్తం, పరిహారం చెల్లించకుండా అనంతమైన పనిగంటలు పనిచేసేలా కార్మికులను నిరంకుశంగా బలవంతపెట్టటం దాని అర్థం కాదని పెట్టుబడిదారులకు చెప్పిన డిమాండ్ అది. శ్రామిక ప్రజలు లొంగిపోరు, తమ హక్కుల కొరకు పోరాడుతారన్న సందేశాన్ని అది తెలియజేసింది. ఈ వీరోచిత పోరాటంలో అనేకమంది కార్మికులు అమరజీవులైనారు. చికాగో హే మార్కెట్ పోరాటం ప్రపంచవ్యాప్తంగా శ్రామిక ప్రజలనందరినీ ఉత్తేజపరిచింది. ప్రపంచ కార్మికుల రెండవ ఇంటర్నేషనల్‌లో, కామ్రేడ్ కారల్ మార్క్ సహచరుడైన ఏంగెల్స్ నాయకత్వ పాత్ర వహించారు; మే దినం శ్రమజీవుల అంతర్జాతీయ దినంగా పాటించబడుతుందని 1899 లో ప్రకటించారు.
భారతదేశంలో కూడా కార్మికవర్గ పోరాటాల వీరోచిత చరిత్ర మనకు ఉంది. చెన్నైలో 1923లోనే తొలిసారి మేడే పాటించటం గర్వకారణమైన విషయం. భారతదేశంలో బ్రిటీష్, ఫ్రెంచి పాలనకాలంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమం ఆవిర్భావం మొదలైంది. కలకత్తా జూట్ (జనపనార) కార్మికులు 1854లో ట్రేడ్ యూనియన్‌గా ఏర్పడ్డారు. 1903లో మద్రాసు ప్రెస్ వర్కర్స్ యూనియన్, 1908లో కోరల్ మిల్ వర్కర్స్ యూనియన్ ఏర్పడ్డాయి. 1920లో వ్యవస్థాపితమైన ఎఐటియుసి శతవార్షికోత్సవాన్ని ఈ సంవత్సరం మనం సగర్వంగా జరుపుకుంటున్నాము. మద్రాసు (చెన్నై)లో ని బి అండ్ సి మిల్లు కార్మికులు ట్రేడ్ యూనియన్‌గా ఏర్పడి 1918 ఏప్రిల్ 3న దాన్ని రిజిస్టర్ చేయించారు. భారతదేశంలో ఇదే తొలి రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్. పుదుచ్చేరి (పాండిచ్చేరి)లోని వస్త్ర మిల్లు కార్మికులు 8గంటల పనిదినం కొరకు భారత కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలో పోరాటం చే శారు. 1936 జులై 30న కార్మికులపై జరిగిన ఆటవికమైన దాడిలో, వారిలో 12 మంది అమరులైనారు. ఫ్రెంచి వలస పాలకులు 8 గంటల పనిదినాన్ని అంతిమంగా అంగీకరించారు. 8గంటల పనిదినం ఆసియాలో అదే ప్రథమం.
కష్టాల సుడిలో ప్రపంచ కార్మికవర్గం
RELATED ARTICLES