వెనకబడిన బిజెపి
జమ్మూ: జమ్ముకశ్మీర్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేపిన డిస్ట్రిక్ట్ డవలప్‌మెంట్ కమిటీ (డిడిసి) ఎన్నికల ఓట్ల లెక్కిం పు కొనసాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం బిజెపిని అడ్డుకోవడానికి గుప్కార్ కూటమి చేసిన ప్రయత్నం సఫలమవుతున్నది. కడపటి వార్తలు అందేసరికి గుప్కార్ ఆధిక్యతలో కొనసాగుతుండగా, బిజెపి గట్టిపోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. స్వయంప్రతిపత్తి రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో తొలిసారిగాజరిగిన డిడిసి ఎన్నికల ఫలితాల్లో బిజెపికి ఊహించినంత ఫలితాలు దక్కలేదు. అయితే జమ్ములో బిజెపి ఆధిక్యతలో వున్నట్లు కన్పిస్తోంది. కశ్మీర్‌లో మాత్రం వెనుకబడింది. కశ్మీర్‌లో గుప్కార్ కూటమి జోరు చూపిస్తోంది. జమ్ము కశ్మీర్‌లో డిడిసిల ఏర్పాటు ఇదే మొదటిసారి. ఆర్టికల్ 370, 35ఏ రద్దు తర్వాత.. తొలిటిసారి ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యం లో జమ్ము కశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలోకి దించి ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి, పీపుల్స్ మూవ్‌మెంట్, పీపుల్స్ కాన్ఫరెన్స్ సహా మరో నాలుగు పార్టీలు కలిసి.. ’పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్’ (పిఎజిడి) ఏర్పాటు చేసుకుని సంయుక్తంగా బరిలోకి దిగాయి. కశ్మీర్ మెజార్టీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ భాజపా ఖాతా తెరవడం గమనార్హం. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటికీ ఇక్కడ భాజపా పలు స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఇటీవల జరుగుతోన్న పలు ఎన్నికల్లో డీలా పడిన కాంగ్రెస్.. డిడిసి ఎన్నికల్లో పుంజుకుంది. పార్టీకి కొత్త జవసత్వాలు ఇచ్చేలా జమ్ము, కశ్మీర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు చెప్పుకోదగ్గ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలివార్తలందే సమయానికి బిజెపి 33 స్థానాల్లో ఆధిక్యతలో వుండగా, జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) 32, పిడిపి 17, కాంగ్రెస్ 11, జెకెఎపి 7, సిపిఐ(ఎం) 5, జెకెపిసి 3, జెకెపిఎం 2, జెకెఎన్‌పిపి ఒక స్థానంలో విజయం సాధించగా, స్వతంత్రులు ఏకంగా 28 స్థానాల్లో విజయం సాధించడం విశేషం.
కశ్మీర్‌లో గెలుపు దిశగా గుప్కార్
RELATED ARTICLES