ప్రతిపక్ష బృందాన్ని అడ్డుకున్న బలగాలు
రాహుల్‌గాంధీ సహా ప్రతిపక్ష బృందానికి ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డగింత
కశ్మీర్‌లోయలో ‘పట్టపగలే రాజ్యాంగ హక్కుల దోపిడీ’
అక్కడ ఏం జరుగుతోందంటూ నేతల అనుమానాలు
శ్రీనగర్ : కశ్మీర్‌లోయలోకి ప్రవేశించకుండా అక్కడి ప్రభుత్వం ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టేసినట్లుగా కన్పిస్తోంది. అక్కడ నిర్బంధాలు ఇం కా కొనసాగుతూనే వున్నాయి. ప్రతిపక్షాలు, మీడియాకు అసలే ప్రవేశం లేదని మరోసారి రుజువైంది. కశ్మీర్‌లోయలో పరిస్థితిని తెలుసుకునేందుకు శనివారంనాడు వెళ్లిన కాం గ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతల బృందాన్ని శ్రీనగర్ విమానాశ్రయంలోనే సాయుధ బలగాలు, అధికారు లు అడ్డుకున్నారు. రాహుల్‌గాంధీతోపాటు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఐ(ఎం) నేత సీతారాం ఏచూరి, లోక్‌తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ నేత మనోజ్ ఝా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత దినేష్ త్రివేది, డిఎంకె నేత తిరుచ్చి శివ, ఎన్‌సిపి, జెడి (ఎస్) నేతలు ఈ బృందంలో వున్నారు. వారంతా శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే ప్రభుత్వం యంత్రాంగం అడ్డుకుంది. రాష్ట్రంలో యథాపూర్వ పరిస్థితి క్రమంగా నెలకొంటున్న నేపథ్యంలో వాటికి అంతరా యం కలగించరాదంటూ ప్రభుత్వ యం త్రాంగం పేర్కొంది. వెంటనే ప్రతినిధి బృం దాన్ని అడ్డుకొని, వారిని తిరిగి ఢిల్లీకి పంపేశారు. పట్టపగలే రాజ్యాంగ హక్కుల దోపిడీగా ప్రతిపక్ష నేతలు ఈ నిర్బంధాన్ని అభివర్ణించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో ఈనెల 5వ తేదీ నుంచి కశ్మీర్‌లో నిర్బంధాలు, ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రతిపక్ష ప్రతినిధి బృందం శనివారం అక్కడకు వెళ్లింది. అయితే, ఇప్పడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నందున విపక్ష నేతలు రావద్దంటూ జమ్మూకశ్మీర్ యంత్రాంగం శుక్రవారంనాడే సూచించింది. శ్రీనగర్ వెళ్లే ముందు సిపిఐ నేత డి.రాజా మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిస్థితిని సృష్టించేందుకు తాము కశ్మీర్‌లోయకు వెళ్లడం లేదని చెప్పారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతలుగానే తాము అక్కడి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు. కశ్మీర్‌లో బయట ప్రపంచానికి తెలియకుండా ఏదో జరుగుతోందని గులాం నబీ ఆజాద్ అనుమానం వ్యక్తంచేశారు. “పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. ప్రతిపక్ష నేతలను మాత్రం పర్యటించడానికి అనుమతించడం లేదు. ప్రభుత్వ వాదన పరస్పర భిన్నంగా ఉంది. పరిస్థితి మామూలుగా ఉంటే ఎందుకు అనుమతించడం లేదు?’ అని గులాం నబీ ఆజాద్ ప్రశ్నించారు. ఎల్‌జెడి చీఫ్ శరద్ యాదవ్ మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్‌లో ప్రజలు ఎలాగో తాము కూడా ఈ దేశ పౌరులమేనని, ఎవరికీ కష్టం కలిగించడం తమ ఉద్దేశం కాదని, వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకు తాము కశ్మీర్ వెళ్తున్నామని చెప్పారు.ఇదిలావుండగా, ఇటీవల కశ్మీర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను గవర్నర్ సత్యపాలిక్ మాలిక్ తప్పుపట్టారు. వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా రాహుల్ మాట్లాడటం తగదని, ఆయన స్వయంగా వచ్చి పరిస్థితి తెలుసుకోవాలని, అందుకోసం రాహుల్‌కు ప్రత్యేక విమానం కూడా పంపుతామని సత్యపాల్ మాలిక్ అన్నా రు. ఇందుకు రాహుల్ వెంటనే స్పందించారు. విమానం పంపాల్సిన పని లేదని, తాను స్వయంగా ప్రతినిధి బృందంతో కలిసివస్తానని, జమ్మూకశ్మీర్లోని ప్రజలు, రాజకీయ నేతలు, సైనికులను స్వేచ్ఛగా కలుసుకునే అవకాశం కల్పిస్తే చాలని సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనికి మళ్లీ గవర్నర్ కార్యాలయం స్పందించింది. అయితే అక్కడకు వెళ్లేసరికి మాలిక్ యంత్రాంగం ప్లేటు ఫిరాయించింది. రాహుల్ ముందస్తు షరతులు పెడుతున్నారంటూ విమర్శించింది. దీనికి సైతం రాహుల్ అంతేవేగంగా స్పందించారు. ఎలాంటి షరతులు లేకుండానే తాము వచ్చేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. కశ్మీర్‌లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయని డి.రాజా విమర్శించారు. ప్రజల హక్కులను కాలరాస్తున్నారని అన్నా రు. కశ్మీర్ ప్రశాంతంగా వుందని ప్రభుత్వం చెపుతున్న మాట వాస్తవదూరమని, అదే జరిగితే, ప్రతిపక్ష బృందాన్ని అడ్డుకోవాల్సిన పనేముందని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు ప్రవేశాన్ని నిరాకరించడం రాజ్యాంగం హామీయిచ్చిన హక్కులను పట్టపగలే దోపిడీ చేయడమేనని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో దుయ్యబట్టింది. మీడియా విషయంలోనూ అక్కడి యంత్రాంగం తప్పుగా ప్రవర్తిస్తున్నదని ఆరోపించింది. 370 అధికరణాన్ని రద్దు చేసినప్పటి నుంచి కశ్మీర్‌లోకి ప్రవేశించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తూనే వున్నాయి. కశ్మీర్‌కే చెందిన గులాం నబీ ఆజాద్ ఇప్పటికే రెండుసార్లు శ్రీనగర్ వరకూ వెళ్లడం, ఆయనను ప్రభుత్వ యంత్రాంగం వెనక్కి తిప్పిపంపడం జరిగింది. మూడోసారి ఇవాళ ప్రతినిధి బృందంతో కలిసి వెళ్లినా తిరిగి అదే పరిస్థితే ఎదురైంది.
వామపక్ష నేతలు డి.రాజా, సీతారాం ఏచూరిని సైతం ఇటీవల శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రభుత్వం యంత్రాంగం కొద్దిసేపు అదుపులోనికి తీసుకుని, ఆ తర్వాత వెనక్కి పంపేసింది. ప్రభుత్వం కూడా కశ్మీర్‌లో ఆంక్షలు విధించి, ఆ తర్వాత ఎత్తేసి, మళ్లీ ఆంక్షలు విధించింది. ఈ పరిస్థితులన్నీ గందరగోళానికి దారితీస్తున్నాయి. అక్కడ తీవ్రస్థాయిలో అరాచకపాలన సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.
కశ్మీర్‌లోకి ‘నో ఎంట్రీ’
RELATED ARTICLES