పాత కేసులతో కలిపి విచారించాలని సుప్రీం నిర్ణయం
న్యూఢిల్లీ: బిఆర్‌ఎస్ నాయకురాలు, తెలంగాణ ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు మూడు వారాలపాటు వాయిదా వేసింది. దాదాపుగా కవిత లేవనెత్తిన అంశాలపైనే గతంలో దాఖలైన పిటిషన్లతో కలిసి విచారించాలని నిర్ణయించింద ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కవితను ఇప్పటికే మూడు పర్యాయాలు ప్రశ్నించింది. అయితే, ఒక మహిళను ఇంటి వద్ద ప్రశ్నించాలే తప్ప, కార్యాలయానికి పిలిపించడం సమంజసం కాదని కవిత వాదన. ఇడి తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను అరెస్టు చేయకుండా ఇడిని ఆదేశించాలని కూడా ఆమె తన పిటిషన్‌లో కోరారు. తొలుత ఈ పిటిషన్‌ను 24వ తేదీన విచారణకు స్వీకరిస్తున్నట్టు తెలిపినప్పటికీ, ఆతర్వాత కేసును సోమవారం (మార్చి 27వ తేదీ) నాటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బేలా ఎం. త్రివేదీతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారం ప్రారంభమైన తర్వాత, సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబిల్ వాదన వినిపిస్తూ, గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం భార్య, సీనియర్ అడ్వొకేట్ నళినీ చిదంబరం కూడా ఇలాంటి పిటిషన్‌నే దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మహిళలకు విచారణ నిమిత్తం సమన్లను జారీ చేయడం చట్టవిరుద్ధమని ఆమె ఆ పిటిషన్‌లో పేర్కొన్నారని కోర్టుకు తెలిపారు. అయితే, ఇడి తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషినల్ సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జి) ఎస్‌వి రాజు ఆ కేసులో ఇది వరకూ త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చిందని అన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నిందితులను విచారించడానికి సమన్లు జారీ చేసే అధికారాన్ని ధర్మాసనం సమర్థించిందని పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత, ఇలాంటి పిటిషన్లను కలిపి ఒకేసారి విచారించడం మేలని అభిప్రాయపడుతూ కేసును మూడు వారాలు వాయిదా వేసింది. ఈ అంశంపై వివరణాత్మక నోట్‌ను సమర్పించేందుకు అనుమతివ్వాల్సిందిగా కోర్టును సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు. 44 ఏళ్ల కవితను ఈనెల 11న ఇడి తొలిసారి ప్రశ్నించింది. తిరిగి 16వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు పంపినప్పటికీ కవిత హాజరుకాలేదు. తన ప్రతినిధితో సంబంధిత పత్రాలు, సమాచారాన్ని ఆమె పంపారు. కాగా, అయితే, ఆ తర్వాత ఇడి జారీ చేసిన సమన్లను అనుసరించి 20, 21 తేదీల్లో ఆమె విచారణకు హాజరయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చినట్టు సమాచారం. అంతేగాక, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లు ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా ఆమె ఖండించారు. ఇదే కేసులో అరెస్టయిన పిళ్లు తాను కవితకు బినామీగా వ్యవహరించానని తొలుత వాంగ్మూలమిచ్చి, ఆతర్వాత దానిని వెనక్కు తీసుకునేందుకు అనుమతివ్వాల్సిందిగా కోర్టును కోరారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎక్కువ శాతం తమకే దక్కేలా సౌత్ గ్రూప్ సంస్థ లాబీయింగ్ చేసిందని ఇడి ఆరోపణ. అందులో శరత్ రెడ్డి (అరబిందో ఫార్మా ప్రమోటర్), మాగుంట శ్రీనివాసులు రెడ్డి (వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపి), ఆయన కుమారుడు రాఘవ్ మాగుంట, కవిత తదితరులను భాగస్వాములుగా పేర్కొంది. కవిత వ్యాపార లావాదేవీలతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చి వాంగ్మూలాన్ని కూడా ఇడి నమోదు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రతినిధిగా విజయ్ నాయర్ వ్యవహరించినట్టు కూడా ఇడి తన నివేదికలో పేర్కొంది. నాయర్‌ను ఇడి, సిబిఐ అదుపులోకి తీసుకోగా, బుచ్చి బాబు సిబిఐ అదుపులో ఉన్నారు.
కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలు వాయిదా
RELATED ARTICLES