నిజామాబాద్‌లో స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఉపఎన్నికలో గెలుపు
ప్రజాపక్షం/హైదరాబాద్ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఉపఎన్నికలో టిఆర్‌ఎస్ విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి కవిత ఘన విజయం సాధించారు. మొత్తం 823 ఓట్లకు గానూ టిఆర్‌ఎస్ 728 ఓట్లు కైవసం చేసుకోగా.. బిజెపి 56, కాంగ్రెస్ 29 ఓట్లు దక్కించుకుంది. 10 చెల్లని ఓట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మొదటిరౌండ్‌లోనే కవితకు భారీ ఆధిక్యం దక్కింది. తొలి రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 531, బిజెపి 39, కాంగ్రెస్‌కు 22 ఓట్లు వచ్చాయి. ఏడు ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. ఆరు టేబుళ్లపై రెండు రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ పూర్తిచేశారు. టిఆర్‌ఎస్ నుంచి మాజీ ఎంపి కవిత పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థిగా సుభాష్‌రెడ్డి, బిజెపి నుంచి లక్ష్మీనారాయణ బరిలోకి దిగారు. ముందు నుంచీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టిఆర్‌ఎస్‌వైపే ఉండగా.. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సిగా కవిత విజయం లాంఛనంగా మారింది. లెక్కింపు అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి కవిత ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. తన గెలుపు కోసం కృషిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరూ సమన్వయంతో పని చేసి ఈ విజయాన్నందించారన్నారు. కాగా, ఉప ఎన్నికలో కవిత గెలుపుతో టిఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. కవిత ఇంటి వద్ద ఉత్సాహంతో మంత్రి ప్రశాంత్‌రెడ్డి నృత్యం చేశారు. అబద్ధపు మాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి అరివింద్ గత ఎన్నికల్లో గెలిచారని, తాజాగా ప్రజలు ఆ మోసాన్ని గ్రహించి పార్టీల సంకెళ్లు తెంచుకొని మరీ టిఆర్‌ఎస్‌కు ఓట్లేశారన్నారు. న్యాయం గెలిచిందని, మోసం ఓడిపోయిందని ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత విజయం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
సిఎం కెసిఆర్‌ను కలిసిన -కవిత
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సిగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత హైదారబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి, తన తండ్రి కెసిఆర్‌ను సోమవారం కలిశారు. ఎంఎల్‌సిగా ఎన్నికైన కవితను ముఖ్యమంత్రి అభినందించారు. ఆశీర్వాదం తీసుకున్నారు. ఎంఎల్‌సిగా ఎన్నికైన కవితను ముఖ్యమంత్రి అభినందించారు. కాగా కవిత వెంట ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు.
కవిత ఘనవిజయం
RELATED ARTICLES