ప్రజాపక్షం/హైదరాబాద్ టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపైన బిజెపి కార్యకర్తలు దాడికి పాల్పడటం పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని కవిత నివాసానికి మంగళవారం పలువురు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా కవితకు సంఘీభావం తెలియజేశారు. మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బాల్క సుమాన్,ఆశన్నగారి జీవన్ రెడ్డి, విద్యాసాగర్ రావు, దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, ముఠాగోపాల్,షకీల్, కాలేరు వెంకటేష్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కవిత ఇంటిపై బిజెపి నేతలు చేసిన దాడిని వారు ఖండించారు.మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.
మీ ఇళ్లపైకి రావడం పెద్ద విషయం కాదు: తలసాని
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ శాంతియుతమైన హైదరాబాద్‌ను నాశనం చేయడం దారుణమన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేయడం దారుణమని, ‘మీ ఇళ్లపైకి’ రావాలంటే పెద్ద విషయం కాదని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే
చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎవరి ఇంటిమీదికైనా వెళ్లి దౌర్జన్యం చేస్తే ఊరుకుంటారా?, క్రమశిక్షణ అంటే ఇదేనా, తాము దాడులు చేస్తే బిజెపి నేతలు మిగులుతారా? అని ప్రశ్నించారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తప్పు జరిగిందని తేలితే కేసులు పెట్టాలని,కానీ భౌతికంగా దాడి చేయడమేమిటని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఊరుకున్నామని, ఇక ఊరుకునే ప్రసక్తి లేదన్నారు.
బిజెపికి మహిళలపై ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు : మంత్రి గంగుల కమలాకర్
బిజెపి నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేసిన ఘటనను రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. ప్రధాని, బిజెపి వైఫల్యాలను బలంగా ఎండగడుతున్నందుకే మహిళ అని కూడా చూడకుండా కక్ష కట్టారని, ప్రణాళికాబద్ధంగా దాడులు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు ఆస్కారం లేదని, బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్యంపై, మహిళలపై గౌరవం లేకుండా ప్రవర్థిస్తున్నారన్నారు. సుస్థిర సంక్షేమ పాలన అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై, నాయకత్వంపై అసత్య ఆరోపణలు, అభూత కల్పనలు చేస్తున్నారన్నారు. మత రాజకీయాలు చేస్తూ ప్రజల్లో తీవ్ర విద్వేశాలు కలిగేలా చేస్తున్న కుట్రల్ని తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తోందన్నారు. తెలంగాణ సమాజం యావత్తు ఎమ్మెల్సీ కవితకు సంఘీభావంగా ఉంటుందన్నారు.
ప్రత్యర్థులను వేధించడంలో అన్ని రికార్డులను అధిగమించిన కేంద్రం: టిఆర్‌ఎస్
ప్రత్యర్థులను వేధించడంలో అన్ని రికార్డులనూ కేంద్ర ప్రభుత్వం అధిగమించిందని ఆర్‌టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ మండిపడ్డారు. ప్రజాస్వా మ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను బిజెపి కూల్చి వేస్తోందని,మోడీ, అమిత్‌షాల అరాచకాలకు హద్దు లేకుండా పోతోందని విమిర్శించారు. హైదరాబాద్‌లోని టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పియుసి ఛైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి,ఎమ్మెల్యే గణేష్ బిగాలతో కలిసి బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ బిజెపి అరాచక దృష్టి తెలంగాణపై పడిందని, మోడీ, అమిత్‌షాపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితకు సంబంధం లేని కేసులో ఇరికించాలని చూస్తున్నారని, ఎక్కడో ఢిల్లీలో జరిగిన ఘటనను మోకాలికి బొడిగుండుకు లింకు పెట్టె ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.ఇలాంటి చిల్లర రాజకీయాలకు కెసిఆర్ భయపడబోరన్నారు.
బాల్క సుమన్ మాట్లాడుతూ సిఎం కేసీఆర్ ప్రశ్నలకు మోడీ, అమిత్‌షాలకు వణుకు పుడుతోందన్నారు. కేంద్రంలో నడుస్తోంది మోడీ ప్రభుత్వం కాదని, అటెన్షన్ డై వర్షన్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. కెసిఆర్‌ను ఎదుర్కోలేని బిజెపి, కవితపై నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు.
ఆశన్న గారి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ బిజెపి రౌడీయిజం, మోడీ ఈడీ ఇజం తెలంగాణలో నడవబోవన్నారు. కవితపైన ఆరోపణలు చేసిన వారికి లుక్ అవుట్ నోటీసులు ఉన్నాయన్నారు. సిబిఐ, ఇడి, ఐటి డిపార్ట్‌మెంట్లు బిజెపి జేబు సంస్థలుగా ఒక కీలు బొమ్మలుగా మారాయన్నారు.
కవిత ఇంటిపై బిజెపి కార్యకర్తల దాడి
RELATED ARTICLES