సూర్యాపేట జిల్లా అసుపత్రి వైద్యులకు నిర్లక్ష్యపు జబ్బు
ప్రజాపక్షం/ సూర్యాపేటబ్యూరో ప్రభుత్వ అసుపత్రుల్లో పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని ఓ పక్క ప్రభుత్వ పెద్దలు చెబుతున్నమాటల్లో ఏమాత్రం వాస్తవం లేదు. వీరి మాటలు విని ఆసుపత్రులకు వెళ్తున్న పేదలు ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. అక్కడ పని చేస్తున్న వైద్యులు రోగులకు సేవలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరు. సొంత క్లీనిక్‌లకు పరిమితమై ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు చేయాలనే విషయాన్ని మరిచిపోతున్నారు. వైద్యుల నిర్లక్ష్యపు జబ్బుతో కళ్లు తెరవకపోవడంతో ఓ శిశువు తల్లి కడుపులోనే కన్నుమూసిన సంఘటన శనివారం సూర్యాపేట ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్(ఎస్) మండలం తెట్టేకుంట తండాకు చెందిన బరావత్ నీరజ అనే గిరిజన మహిళ ప్రసవం కోసం శుక్రవారం ఉదయం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు నొప్పులు వచ్చిన తర్వాత ప్రసవం చేద్దామని, అప్పటి వరకు వేచి ఉండమని చెప్పారు. శనివారం తెల్లవారుజామున నొప్పులు రావడంతో ఆమె కుటుంబసభ్యులు అక్కడ ఉన్న వైద్య సిబ్బందికి తెలియజేశారు. అయితే తాము గాఢ నిద్రలో ఉన్నామని, తమను ఎందుకు లేపారంటూ దబాయిస్తూ ప్రసవం చేసేందుకు వైద్యులు అందుబాటులో లేరని ఆగహం వ్యక్తం చేశారు. నీరజ నొప్పులు భరించలేక తల్లడిల్లినా సిబ్బంది మనస్సు మాత్రం కరగలేదు. నొప్పిన బరిస్తూ తెల్లవారేంత వరకు వేచి ఉండకతప్పలేదు. శనివారం ఉదయం ఆసుపత్రికి వైద్యులు రాగానే నీరజను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసిన బాలిడి మృతదేహాన్ని వారి కుటుంబసభ్యుల చేతులో పెట్టారు. దీంతో వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురై అక్కడే కుప్పకూలారు.
ఆసుపత్రి ఎదుట ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యం వల్లే నీరజ జన్మనించిన శిశువు మృతి చెందాడని, తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంజార సేవా సంఘం ఆధ్వర్యంలో బాధిత కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ సంఘం రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ చివ్వెంల మండల పార్టీ అధ్యక్షులు ధరావత్ వీరన్ననాయక్ డిమాండ్ చేశారు. గిరిజనుల పట్ల పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గిరిజనులు చేపట్టిన ఆందోళన ఉదృతం కావడంతో పోలీసులు ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ దండ మురళీధర్‌రెడ్డి ఆందోళన చేస్తున్న గిరిజన సంఘం నాయకులతో మంతనాలు జరిపారు. ఘటనపై విచారణ చేసి బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు.
కళ్లు తెరవని వైద్యులు… కడుపులోనే శిశువు మృతి
RELATED ARTICLES