సిపిఐ కొవిడ్ హెల్ప్ లైన్ సెంటర్‌కు అనూహ్య స్పందన
బాధితులందరికీ కొవిడ్ మందుల కిట్లు ఇవ్వాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలు, ఫంక్షన్ హాళ్లను కోవిడ్ ఇసోలేషన్ సెంటర్లుగా మార్చాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐసోలేషన్ సెంటర్లలో కోవిడ్ బాధితులకు ఆశ్రయం కల్పించి, తగిన వైద్య సదుపాయాలను అందించాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్‌ను రాష్ట్రంలో అందరకి అందే విధంగా సత్వరం చర్యలు తీసుకోవాలన్నారు. సిపిఐ రాష్ట్ర సమతి అధ్వర్యంలో రెండు రోజుల కిందట ఐదుగురు సభ్యులతో ప్రారంభించిన కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్‌కు అనూహ్య స్పందన వచ్చిందని ఆయన వెల్లడించారు. హెల్ప్‌లైన్ సెంటర్‌కు వైద్య సహాయానికి వచ్చిన రోగుల కాల్స్‌ను పరిశీలించి, వారికి ఉన్న కోవిడ్ లక్షణాల ప్రకారంగా హెల్ప్‌లైన్ సెంటర్‌కు అనుబంధంగా ఉన్న పది మంది వైద్యులతో ఆన్‌లైన్‌లో మాట్లాడిస్తూ వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. పంజాబ్, తమిళనాడు నుండి కూడా హెల్ప్ లైన్ సెంటర్‌కు కాల్స్ వచ్చాయన్నారు. రెండు రోజులలోనే హెల్ప్ లైన్ సెంటర్‌కు 88 మంది వైద్య సహాయం కోసం కాల్ చేశారన్నారు. సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఈ కాల్స్ ద్వారా అర్ధం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న కోవిడ్ మందుల కిట్లు అందరికి అందడం లేదన్నారు. కోవిడ్ కిట్లపై అవగాహన కల్పించి, అవసరం ఉన్న అందరకి అందే విధంగా చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్ డయాగ్నస్టిక్ సెంటర్ల దోపిడినీ, కోవిడ్ వైద్యంలో ఉపయోగించే ఇంజక్షన్‌ల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కళాశాలలు, ఫంక్షన్‌హాళ్లను కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చాలి
RELATED ARTICLES