హెచ్‌సిఎ అధ్యక్షుడిగా ఎన్నికైన అజారుద్దీర్
ఎన్నికల్లో 147 ఓట్లతో గెలుపొందిన టీమిండియా మాజీ సారధి
క్రికెట్ అభివృద్ధికి పనిచేస్తా: అజారుద్దీన్
హైదరాబాద్(ఉప్పల్) : టీమిండియా మాజీ సారథి, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) ఎన్నికల్లో గెలుపొందారు. అజారుద్దీన్ 147 ఓట్లతో ఘన విజయం సాధించగా… ప్రత్యర్థి ప్రకాశ్ జైన్‌కు 73 ఓట్లు పోలవగా.. మరో అభ్యర్థి దిలీప్ కుమార్‌కు కేవలం 3 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 227 ఓట్లకు గాను.. 223 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం (సెప్టెంబర్ 27) హెచ్‌సీఏ ఎన్నికలు నిర్వహించారు. టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ చివరి నిమిషంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా అజార్ ప్యానెల్‌కు చెందిన జాన్ మనోజ్ విజయం సాధించారు. 49 ఓట్ల ఆధిక్యంతో హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడిగా మనోజ్ గెలుపొందారు. ఫలితాల అనంతరం ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఆవరణలో అజారుద్దీన్ వర్గం సంబురాలు చేసుకుంది. 56 ఏళ్ల అజారుద్దీన్ భారత్ తరఫున 99 టెస్టులు, 334 వన్డే మ్యాచ్‌లు ఆడారు.అధ్యక్ష ఎన్నికలో ఆది నుంచి అజారుద్దీన్ దూకుడుగా కనిపించడంతో పోటీ నామమాత్రమే అయింది. మిగతా 5 స్థానాలకు గట్టి పోటీ నెలకొంది. హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం అజారుద్దీన్‌తో పాటు ప్రకాశ్ చంద్ జైన్, దిలీప్ కుమార్ పోటీ పడ్డారు. ఈసారి ఎలాగైనా హెచ్‌సీఏ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ప్రయత్నించిన అజార్ తన పంతం నెగ్గించుకున్నారు. గతేడాది చివరి గంటల్లో ఆయన నామినేషన్ రద్దు కావడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
అన్ని ప్యానెల్స్ అజహరుద్దీన్ వైపే
హెచ్ అధ్యక్షుడిగా అన్ని ప్యానెల్స్ అజహరుద్దీన్ వైపే మొగ్గు చూపాయి. ఈ ఎన్నికల బరిలో మొత్తం మూడు ప్యానెల్స్ ఉన్నాయి. ప్రధాన పోటీ మాత్రం అజహరుద్దీన్, ప్రకాశ్ చంద్ జైన్ ప్యానళ్ల మధ్యే కొనసాగింది. హెచ్‌సీఏ అధ్యక్షుడి మినహా మిగతా ఐదుస్థానాలకు ఈ రెండు ప్యానెళ్ల మధ్య గట్టి పోటీ ఎదురైంది. ఈ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. అనంతరం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 155 ప్రైవేట్ క్లబ్‌లకు చెందిన ప్రతినిధులతో పాటు 51 ఆయా సంస్థల క్లబ్‌లు, తొమ్మిది జిల్లా క్రికెట్ సంఘాలు, 11 మంది మాజీ క్రికెటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ నామినేషన్ తిరస్కరణ కావడంతో అతడు అజారుద్దీన్‌కు వ్యతిరేకంగా ప్రకాష్ ప్యానెల్‌కు మద్దతు ఇచ్చారు.
అజహరుద్దీన్ ఘన విజయం
అయినప్పటికీ అజహరుద్దీన్ ఘన విజయం సాధించడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడి కావాలన్న తన కల ఫలించినట్లయ్యింది. 2017లో ఇదే పదవికి అజార్ నామినేషన్ వేసినప్పటికీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధం ఉండడంతో హెచ్‌సీఏ అధికారులు అజార్ నామినేషన్‌ను తిరస్కరించారు. బీసీసీఐ అతడికి క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ ఆ పత్రాలు సమర్పించలేదన్న కారణంతో నామినేషన్‌ను తిరస్కరించినట్టు హెచ్‌సీఏ అప్పట్లో పేర్కొంది. అయితే హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి మరోసారి పోటీపడ్డ అజహర్ విజయం సాధించారు.
క్రికెట్ అభివృద్ధికి కృషి..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడు కావాలన్న కలను అజహరుద్దీన్ ఎట్టకేలకు సాకారం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసి భంగపడ్డ ఆయన ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం అందుకున్నారు. హెచ్‌సీఏలో పట్టున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు, తదితరుల అండతో మాజీ అధ్యక్షుడు వివేక్ ప్యానెల్ మద్దతు ఇచ్చినా ప్రకాశ్‌చంద్‌ను చిత్తుగా ఓడించారు. వివేక్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం కూడా అజర్‌కు కలిసొచ్చింది. హెచ్‌సిఎ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో అజహరుద్దీన్ పార్టీ మారతారన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది. టిఆర్‌ఎస్ మద్దతుతోనే ఆయన గెలిచారన్న చర్చ కూడా జరుగుతోంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. పార్టీ మారతానో, లేదో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. టిఆర్‌ఎస్‌లో చేరతానో, లేదో చెప్పే వేదిక ఇది కాదని అన్నారు. తన ప్యానల్‌తో సహా ప్రగతి భవన్‌కు వెళ్లి శనివారం ఉదయం ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలవనున్నట్టు తెలిపారు. క్రికెట్ అభివృద్ధి గురించి సిఎంతో చర్చిస్తానని చెప్పారు.
కల నెరవేరింది
RELATED ARTICLES