HomeNewsBreaking Newsకల్తీ మద్యానికి 28 మంది బలి

కల్తీ మద్యానికి 28 మంది బలి

గుజరాత్‌ బొటాడ్‌ జిల్లాలో నాటుసారలో విషం
అహమ్మదాబాద్‌ :
గుజరాత్‌లో విషాదం అలముకుంది. బొటాడ్‌ జిల్లాలో కల్తీసారా తాగి మొత్తం 28 మంది మృత్యువాత పడినట్లు ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి చెప్పారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ఒక మహిళ సహా నాటుసారా కాచే కొంత మంది చిరువ్యాపారులు నీటిలో అత్యంత విషపూరితమైన మిథైల్‌ ఆల్కాహాల్‌ను (మిథనాల్‌) కలిపి నాటుసారా తయారు చేసి గ్రామస్థులకు రూ. 20కి ఒక బుడ్డిని విక్రయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. మృతుల రక్తపు నమూనాలను కూడా పరీక్షించగా వారు మిథనాల్‌ను తీసుకున్నట్లు ధ్రువీకరణ అయిందని గుజరాత్‌ డిజిపి అశీష్‌ భాటియా మీడియాకు వెల్లడించారు. 14 మంది ప్రధాన నిందితులపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు కాగా, అందులో అత్యధిక మందిని అదుపులోకి తీసుకున్నట్లు డిజిపి చెప్పారు. బొటాడ్‌ జిల్లాలోని రోజిడ్‌ గ్రామం, దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడం ప్రారంభం కావడంతో వారిని బొటాడ్‌ పట్టణాలు, బర్వాలా ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు రెఫర్‌ చేశారు. దీంతో సోమవారం ఉదయం కల్తీసారా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు కల్తీ సారా సేవించి 28 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 22 మంది బొటాడ్‌ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన వారు కాగా, ఆరుగురు పొరుగున ఉన్న అహమ్మదాబాద్‌లోని మూడు గ్రామాలకు చెందిన వారని డిజిపి చెప్పారు. వీరే కాకుండా మరో 45 మందికిపైగా ప్రజలు ప్రస్తుతం భావనగర్‌, బొటాడ్‌, అహమ్మదాబాద్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతులు మిథైల్‌ ఆల్కాహాల్‌ను సేవించినట్లు ఫోరెన్సిక్‌ విశ్లేషణలో వెల్లడయిందని, ఈ ఘటనలో 14 మందిపై హత్య, ఇతర నేరాలకు సంబంధించన కేసులు నమోదు చేశామని, విచారణ నిమిత్తం కొంతమందిని అరెస్టు చేశామని భాటియా పేర్కొన్నారు. బాధితులకు విషపూరిత మద్యంలో ఉండే మిథైల్‌ను ఎమోస్‌ అనే కంపెనీ సరఫరా చేసినట్లు సిట్‌ విచారణలో వెల్లడైందని, గోడౌన్‌ మేనేజర్‌ జయేష్‌ అకా రాజు తన బంధువు సంజయ్‌కు రూ.40 వేలకు 600 లీటర్ల మిథైల్‌ను సరఫరా చేయగా, సంజయ్‌ అతని సహచరుడు పింటూ, మిథైల్‌ రసాయనాలతో నిండిన పౌచ్‌లను దేశంలో తయారు చేసిన మద్యం పేరుతో ప్రజలకు విక్రయించారన్నారు. ప్రజలు దాన్ని తాగి అనారోగ్యంతో మరణించారు. మొత్తం 600 లీటర్ల మిథైల్‌ను ఎమోస్‌ కంపెనీ సరఫరా చేసిందని, అందులో 450 లీటర్లను తాము స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఘటనపై విచారణ జరిపి నకిలీ మద్యం విక్రయించే దొంగలను పట్టుకునేందుకు డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ర్యాంక్‌ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (భావ్‌నగర్‌ రేంజ్‌) అశోక్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఇప్పటివరకు అక్రమ మద్యం వ్యాపారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అ క్రమ మద్యం వ్యాపారుల ప్రాంగణాల్లో దొరికిన అన్ని రసాయన పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. కాగా, కల్తీ మద్యం వ్యాపారులకు రాజకీయ రక్షణ ఉందని గుజరాత్‌ పర్యటనలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈ సంఘటన దురదృష్టకరమని పేర్కొంటూ, నిషేధం అమలులో ఉన్న గుజరాత్‌లో అక్రమ మద్యం పెద్ద మొత్తంలో అమ్ముడవుతుందని కేజ్రీవాల్‌ ఆరోపించారు.అక్రమ మద్యం బాగోతంపై దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments