మరో ఏడుగురికి తీవ్ర అనారోగ్యం
మధ్యప్రదేశ్‌లోని మొరేనాలో ఘటన
భోపాల్/మొరేనా: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. మొరేనా జిల్లాలో కల్తీ మద్యం సేవించి 12 మంది మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో మూడు నెలల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇది రెండవసారి. ఘటనపై ప్రాథమిక విచారణ ప్రకా రం… సోమవారం రాత్రి తెల్లరంగులో ఉన్న మద్యాన్ని మన్‌పూర్, పహవలి గ్రామాలకు చెందిన ప్రజలు సేవించారని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. మొత్తం 12 మంది కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయారని మరో ఏడుగురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, డిఐజి రాజేష్ హింగాంకర్ మీడియాకు తెలపారు. ఎక్సైజ్ చట్టంలో 34,91 సెక్షన్ల కింద, అలాగే ఐపిసిలోని 304 కింద కేసులు నమోదు చేశామన్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన మరో ఏడుగురిని చికిత్స నిమిత్తం గ్వాలియర్‌కు సిఫార్సు చేసినట్లు మొరేనాలోని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని, నివేదికలకు వచ్చిన తరువాతే బాధితులు తాగిన మద్యం కల్తీదా, కాదా అనే తెలుస్తుందని ఆ అధికారి తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ ఇది చాలా విచారకరమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. నిర్లక్ష్యం వహించినందుకు మొరేనా జిల్లా ఎక్సైజ్ అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించామన్నారు. దోషులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఘటనపై రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా స్పందిస్తూ ఈ కేసులో ఓ పోలీసు అధికారిని సస్పెండ్ చేశామన్నారు. కల్తీ మద్యం సేవించి మృత్యువాత పడడం చాలా విచారకరం, తీవ్ర బాధాకరమన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిని ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సిఎం కమల్‌నాథ్ తీవ్రంగా స్పందించారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉజ్జయినిలో 16 మందిని బలితీసుకున్న తర్వాత కూడా మద్యం మాఫియా వినాశకర ధోరణలు కొనసాగుతున్నాయన్నారు. తాజాగా ఈ రక్కసి మరో 12 మందిని బలితీసుకుందని తెలిపారు. ఈ లిక్కర్ మాఫియాకు ఇంకా ఎంతకాలం ప్రజలు ఇలా బలికావాలి? అని ప్రశ్నించారు. అనారోగ్యానికి గురైన వారికి తగిన చికిత్స అందించడంతో పాటు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
కల్తీ మద్యానికి 12 మంది బలి
RELATED ARTICLES