ఢిల్లీ : సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. తొలి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసిన సన్‌రైజర్స్ తర్వాత అనూహ్యంగా పుంజుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. గురవారం రాత్రి ఫిరోజ్‌షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 5 వికెట్లతో ఘణ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక సన్‌రైజర్స్ రెగ్యూలర్ కెప్టెన్, కీలక ఆటగాడు కేన్ విలియమ్సన్ జట్టుకు దూరమవడంతో అతని స్థానంలో పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తాత్కాలిక సారథ్య బాధ్యతలు నిర్వర్థిస్తున్నాడు. గురువారం ఢిల్లీపై విజయం సాధించిన అనంతరం భువనేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘జట్టు సమష్టిగా రాణిస్తే సారథ్యం వహించడం మరింత సులభమవుతుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. గురువారం కోట్లాలో జరిగిన ఢిల్లీ మ్యాచ్‌లో పిచ్ బౌలర్లకు సహకరించింది. ఇక్కడ బంతిని బాదడం అంత సులువు కాదని మాకు ముందే తెలుసు. ఈ మ్యాచ్‌లో 140 నుంచి 150 పరుగుల లక్ష్యం ఉంటే ఛేదనకు కాస్త శ్రమించాల్సి వస్తుందనుకున్నాం. ప్రణాళిక ప్రకారం ప్రత్యర్థిని అంతలోపే కట్టడి చేశాం. తర్వాత బ్యాటింగ్‌లో బెయిర్ స్టో అద్భుతంగా ఆడాడు. 28 బంతుల్లో 48 పరుగులు చేసి జట్టుకు శుభారంభం ఇవ్వడంతో పాటు విజయానికి బాటలు వేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలవడం చాలా కీలక పాత్ర పోషించింది. ఢిల్లీ బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్ ఎలా స్పందిస్తుందో పరిశీలించాం. అలా చేయడం వల్ల లక్ష్యాన్ని ఛేదించేందుకు మాకు బాగా ఉపయోగపడింది’ అని భువనేశ్వర్ కుమార్ తెలిపాడు.
కలిసికట్టుగా రాణిస్తే సారథ్యం సులభమే
RELATED ARTICLES