న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని, వైరస్ గురించి అతిగా భయపడొద్దని, అందరూ కలిసి రావాలని భారత్ సార్క్ దేశాలకు పిలుపునిచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యుహంపై సార్క్ దేశాలు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించాయి. ఈ సమావేశంలో భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, ఆఫ్ఘనిస్థాన్, భూటాన్, నేపాల్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘సార్క్ దేశాలలో 150 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. కానీ ప్రపంచ జనాభాలో ఐదవ వంతు జనాభా మన దేశాల్లో ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. మన ప్రాంతంలోని వైద్య సౌకర్యాలకు ఎన్నో సవా ళ్లు ఉన్నాయి. కరోనాను ఎదుర్కొవడానికి మనందరం కలిసి సిద్ధం కావాలి, కలిసి పనిచేయాలి, అలాగే ఉమ్మడిగా విజయం సాధించాలి. కరోనాను ఎదుర్కోవడానికి అనుగుణం గా దేశంలోని వైద్య సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి భారత్ వేగంగా చర్యలు తీసుకుం ది. భారత ప్రభుత్వం కరోనాను తక్కువగా అం చనా వేయకుండా జాగ్రత్త వహించింది. చాలా క్రియాశీలంగా వ్యవహరించడంతోపాటు, జనవరి మధ్య భాగంలోనే స్క్రీనింగ్ చేయడం ప్రారంభించాం. కరోనా వైరస్ నియంత్రణకు ముందస్తు జాగ్రత్త చర్యలే ముఖ్యం’ అని తెలిపారు. “మన ప్రజల మధ్య సంబంధాలు ప్రాచీనమైనవి. మన దేశాలు కూ డా ఎప్పటి నుంచో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. మన దగ్గర వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు మనందరం కలిసి పోరాడాలి. అప్పుడే విజయం సాధ్యం. కరోనాను అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా భారత్ 10మిలియన్ డాలర్లతో నిధి ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేపాల్ ప్రధాని కెపిశర్మ ఓలికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా” అని మోడీ అన్నారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే మాట్లాడుతూ.. ఈ సమావేశ ఏర్పాటుకు పిలుపునిచ్చినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు. దీని ద్వారా మన అనుభవాలు, ఆలోచనలు పంచుకోవడంతోపాటు సవాళ్లను అర్థం చేసుకోవడానికి, ఆపై తీసుకోవలసిన చర్యలపై చర్చించడానికి అవకాశం కలిగింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి దక్షిణాసియా దేశాలు తమ ఆలోచనలు, పద్ధతులు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలి” అని అన్నారు. మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో భాగంగా సార్క్ సమావేశం ఏర్పాటుకు చొరవ చూపించిన భారత్‌కు ధన్యవాదాలు. మాల్దీవులకు సహాయం చేసేందుకు భారత్ ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాం. భారత ప్రజలకు, మోదీకి మా కృతజ్ఞతలు. ఈ వైరస్‌ను ఎదుర్కోవడంతో ఏ దేశం ఒంటరిగా విజయం సాధించలేదు. అందరం కలిసి పోరాడాలి” అని అన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ.. తమ దేశంలోని 23 మంది విద్యార్థులను వుహాన్ నుంచి తిరిగి తీసుకువచ్చినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థాన్ ప్రధాని ప్రత్యేక సహాయకుడు జాఫర్ మీర్జా మాట్లాడుతూ.. కరోనా ప్రభావంతో ఇప్పటికే 1,55,000కు పైగా బాధితులుగా మారారు. 5,833 మంది ప్రాణాలు కోల్పోయారు. 138 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. ఈ విషయంలో ప్రపంచంలోని ఏ దేశం స్పందించకుండా ఉండలేదని అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని మాట్లాడుతూ.. కరోనాను అడ్డుకునేందుకు టెలీ మెడిసిన్ చేయాలి. అందుకోసం మనమంతా ఒక జట్టుగా ఏర్పడాలి. సరిహద్దులను మూసివేయడం వల్ల ఆహారం, మందులు ఇతర ప్రాథమిక వస్తువుల లభ్యతలో తీవ్రమైన సమస్య ఏర్పడుతుందని పేర్కొన్నారు.