కొత్త సిఎంపై త్వరలో నిర్ణయం
బెంగళూరు: కర్నాటక ముఖ్యమం త్రి యడియూరప్పను తొలగించాల ని బిజెపి అధిష్టానం నిర్ణయించుకుందని వచ్చిన వార్తలపై కొంతకాలం గా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. ముఖ్యమంత్రి పదవికి సోమవారం ఉదయం యడియూరప్ప రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కర్నాటక థావర్‌చందర్ గెహ్లాట్‌కు అందచేశారు. దానిని ఆమోదించిన గవర్నర్ కొత్త సిఎం ఎన్నికయ్యే వరకూ అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా యడ్యూరప్పకు సూచించారు. కొత్త సిఎం ఎన్నిక ఒకటిరెండు రోజుల్లో జరిగే అవకాశాలున్నాయి. రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న యడియూరప్పకు ఉద్వాసన పలకడం ఖాయమని కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన సిఎంగా బాధ్యతలు స్వీకరించి ఆదివారానికి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. బిజెపి గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 70 సంవత్సరాలు నిండిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వడానికి వీల్లేదు. అయితే, 78 ఏళ్ల యడ్యూరప్పను అత్యంత ప్రత్యేకమైన పరిస్థితుల్లో కర్నాటక సిఎంగా బిజెపి అధిష్టానం అంగీకరించింది. ఇప్పుడు రెండేళ్లు పూర్తయిన కారణంగా ఆయనను తప్పించి, మరొకరికి బాధ్యతలు అప్పచెప్తారన్న వాదన బలంగా వినిపించింది. అయితే యడ్యూరప్ప పనితీరు అద్భుతంగా ఉందని నడ్డా వ్యాఖ్యానించడంతో ఒక దశలో సిఎం మార్పు ఇప్పట్లో లేనట్టేనా అనుమానం తలెత్తింది. కానీ, సోమవారం ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి ఒక ప్రశ్నకు సమాధానాన్నిచ్చారు. ఇలావుంటే, కర్నాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పదవికి యడియూరప్ప ఎవరి పేరునూ ప్రతిపాదించకపోవడంతో, రేసులో ఉన్నవారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది.
భావోద్వేగం..
కర్నాటక ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన యడియూరప్ప, తన రెండేళ్ల పాలన ముగిసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ రెండు సంవత్సరాల్లో తాను ఎన్నో సవాళ్లను, పరీక్షలను ఎదుర్కొన్నానని చెప్పారు. రాష్ట్రంలో పార్టీ కోసం ఒంటరిగా పోరాడినట్లు పేర్కొంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జన్‌సంఘ్‌లో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు రైతులు, దళితుల కోసం పోరాటాలు చేశానని, భవిష్యత్తులోనూ అదే పంథాను అనుసరిస్తానని అన్నారు. సిఎంగా రాజీనామా చేసినప్పటికీ తాను కర్నాటక క్రియాశీలక రాజీకాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. 75 సంవత్సరాలు పైబడినప్పటికీ తనకు రెండేళ్లు కర్నాటక ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాకు కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీరు పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితమే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాజీనామా చేయాలని తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదని అన్నారు. కొత్త ముఖ్యమంత్రిగా ఎవరి పేరునూ తాను ప్రతిపాదించలేదని, పార్టీ అధిష్టానం ఎవరిని నియమిస్తే, వారికి సహకరిస్తానని తెలిపారు. 2023లో జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. గవర్నర్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్టు మీడియాలో వచ్చిన వార్తపై స్పందిస్తూ, తాను ఎక్కడికీ వెళ్లేది లేదని తేల్చిచెప్పారు.
సిఎం రేసులో ప్రముఖులు..
కర్నాటక కొత్త సిఎం రేసులో పలువురు ప్రముఖ నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్నాటక అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే ఖగేరీ, రాష్ట్ర డిప్యూటీ సిఎం అశ్వత్ నారాయణ, హోం శాఖ మంత్రి బసవరాజ్ బొమ్మయి, ఆర్థిక మంత్రి ఆర్. అశోక్, గనుల శాఖ మంత్రి మురుగేశ్ నిరానీ, బిజెపపి జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవి, సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సదానంద గౌడ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎంఎల్‌ఎ అరవింద్ బెల్లాడ్ కూడా సిఎం పీఠాన్ని ఆశిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద క్షణక్షణానికి ఆశావహుల జాబితా పెరుగుతున్నది. మరోవైపు కొత్త సిఎం ఎంపికను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని బిజెపి అధిష్టానం భావిస్తున్నది. ఒకటిరెండు రోజుల్లోనే పరిశీలకులను పంపి, అభిప్రాయ సేకరణను పూర్తి చేసి, తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, బిజెపి అధినాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నది. కర్నాటకలో ఓటు బ్యాంకులో కీలకంగా వ్యవహరిస్తున్న లింగాయత్‌లకే అవకాశాన్ని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది. మంగళవారం కొత్త ముఖ్యమంత్రి పేరును బిజెపి అధిష్టానం ప్రకటిస్తుందని తెలుస్తోంది.